రాష్ట్ర వ్యాప్తంగా వినాయకచవితి సంబరాలు కోలహలంగా జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లో...
వినాయకచవితిని పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ తొలిపూజ నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి... సికింద్రాబాద్ గణేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయమని మంత్రులు పేర్కొన్నారు.
నిర్మల్‌లో..
నిర్నల్ జిల్లా కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నెలకొల్పిన కర్ర గణపతి వద్ద దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తొలి పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. విఘ్నేశ్వరుని కృపతో కరోనా వెళ్లిపోయి.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి కోరుకున్నారు.
జగిత్యాలతో..
జగిత్యాలలో వినాయక చవితి సందడి మొదలైంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. మెట్పల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విత్తనాలు కలిగిన మట్టి వినాయకుల ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు.
హనుమకొండలో..
హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ దంపతులతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ ప్రారంభించారు. అనంతరం.. కాళోజీ కూడలి వద్ద ఆయాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాలను వినయ్‌భాస్కర్ పంపిణీ చేశారు.
హనుమకొండ జిల్లా ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలో వినాయక చవితి పర్వదిన వేడుకలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. 16 రోజుల పాటు గణేశ్ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.
ఖమ్మంలో..
ఖమ్మం నగరంలోని వీధుల్లో, ఆలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథులు కోలువుతీరారు. బ్రహ్మణ బజార్ శివాలయం కమిటీ ఆధ్వర్యంలో అతి పెద్ద మట్టి గణపతి విగ్రహన్ని ఏర్పాటు చేశారు. 18 అడుగుల ఎత్తులో ఉండే మట్టి గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టిగణపతిగా తమ గణపతి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోనూ వినాయక చవితి సంబరాలను సంతోషంగా నిర్వహించుకుంటున్నారు. రెండేళ్లుగా ఎన్నో విఘ్నాలు ఎదుర్కొన్న భక్తులు.. ఈ ఏడాది కాస్త ఉపశమనంగా పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. సింగరేణి యాజమాన్యంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.
జోగులాంబ గద్వాలలో...
జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉన్న రససిద్ధి గణపతికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలు ఏ కార్యం తలపెట్టినా... విఘ్నం లేకుండా జరగాలని విఘ్నేషున్ని వేడుకున్నారు. పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో...
నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. పోటాపోటీగా ప్రత్యేకాలంకరణలతో యువజన సంఘాలు, వివిద కుల సంఘాల ఆధ్వర్యంలో వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. బాల్కొండలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:
Khairtabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ