Anantapur Forest: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గవ్యాప్తంగా అటవీ ప్రాంతంలో వందల ఎకరాల్లో అడవి అగ్నికి ఆహుతైంది. అసలే అతి తక్కువ వర్షపాతం కలిగిన జిల్లాగా అనంతపురం ఉంది. ఇప్పుడిప్పుడే జిల్లాలోని పెనుకొండలో అటవీ ప్రాంతం వృక్ష సంపదతో కళకళలాడుతోంది. అయితే.. గత రెండు రోజులుగా పెనుకొండ పరిసర ప్రాంతాల్లో కొంతమంది అడవికి నిప్పు పెట్టడంతో వందలాది ఎకరాల్లో చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
అటవీ సంపద బూడిద పాలు
వేలాది వృక్షాలు కాలిపోవడంతో బూడిద మిగిలింది. వందల సంఖ్యలో అటవీ వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని లక్షల రూపాయల విలువ చేసే అటవీ సంపద ఈ అగ్ని కీలల్లో చిక్కుకుని మాడిపోతుండటంతో.. సమీపంలోని పల్లెల్లోని ప్రజలు తమకు ఏదైనా హాని జరుగుతుందేమోనని భయాందోళనకు గురవుతున్నారు.
వారే కారణమా.?
ఈ పరిస్థితికి ఆకతాయిలు, పశువుల కాపరులే కారణమా? అనే చర్చ సాగుతోంది. కొందరు తమ వికృతానందం కోసం, స్వార్థం కోసం అడవితల్లి కడుపులో చిచ్చు పెడుతున్నారని, ఆ కార్చిచ్చు.. అడవి మొత్తం వ్యాపించి, చెట్లను, వన్యప్రాణులను బూడిద చేస్తోందని స్థానికులు అంటున్నారు.
నిఘా పెట్టాలి
అటవీశాఖ అధికారులు నిఘాపెట్టి, ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అడవులు అభివృద్ధి చెందడానికి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టే ప్రభుత్వాలు.. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వాటి నివారణ చర్యలకు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: Govt into Real Estate: స్థిరాస్తి వ్యాపారంలోకి సర్కారు.. పైలట్ ప్రౌజెక్టుగా ఆ జిల్లా.!