అప్పుచేసి... అన్నం పెడుతున్నారు!

తమిళనాడులోని తిరుచ్చికి చెందిన చంద్రశేఖర్ వృత్తిరీత్యా వెల్డర్. గతేడాది లాక్‌డౌన్ ప్రకటించిన సమయానికి పనికోసం వెళ్లి ఇంటినుంచి చాలా దూరంలో ఉన్నాడు. తిరిగి కొన్ని గంటలపాటు నడిచి ఆకలితో ఇంటికి చేరుకున్నాడు. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే సుదూరాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వాళ్ల సంగతేం కావాలి అనుకున్నాడు. అందుకే తన వంతుగా కనీసం నలుగురి ఆకలైనా తీర్చాలనుకున్నాడు. కానీ అతడి దగ్గర అంత డబ్బు కూడా లేదు. పరిస్థితి కాస్త కుదుటపడ్డాక ఆగస్టులో బ్యాంకు నుంచి రూ.50 వేలు అప్పుతీసుకుని నగరంలోని అన్నా స్టేడియం ప్రాంతంలో రూ.5కే భోజనం అందించడం మొదలు పెట్టాడు. చంద్రశేఖర్ పనికి వెళ్తే, అతడి భార్య పుష్పరాణి పిల్లల సాయంతో ఈ స్టాల్‌ను నిర్వహిస్తోంది. రోజూ మధ్యాహ్నం 12 నుంచి రెండింటి వరకూ ఇక్కడ భోజనం అందుబాటులో ఉంచుతారు. ‘మేం భోజనాన్ని ఉచితంగా ఇవ్వదలచుకోలేదు. దీన్నుంచి లాభం పొందాలనీ అనుకోవడంలేదు. ఎవరి ఆత్మగౌరవమూ దెబ్బతినకుండా ఆకలి తీర్చుతున్నాం’ అని చెబుతారు పుష్పరాణి. ఎవరైనా డబ్బులు లేవని చెబితే మాత్రం వారిని అడగరు. అలాగే ఎవరైనా వీళ్లు చేస్తున్న పనిని మెచ్చి అదనంగా 10, 20 ఇస్తే తీసుకుంటారు. రోజూ ఈ స్టాల్ కోసం తనకొచ్చే కూలీ మొత్తానికి అదనంగా కొంత ఖర్చుచేస్తున్నాడు చంద్రశేఖర్. కానీ తమకు లభిస్తున్న తృప్తి ముందు డబ్బుకు అంత ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం లేదంటారా దంపతులు.
ఇక్కడ భోజనం ఉచితం!

హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ప్రాంతం, సూర్య నగర్ చుట్టుపక్కల బస్తీల్లో పదేళ్ల నుంచీ నిరుపేదల ఆకలి తీరుస్తున్నాడు ఆసిఫ్ హుస్సేన్ సోహైల్. తన నివాసానికి ఆనుకుని చిన్న షెల్టర్‌ని ఏర్పాటుచేసిన ఆసిఫ్... రోజూ మధ్యాహ్నం అక్కడ వందల సంఖ్యలో అన్నం, పప్పు ప్యాకెట్లను ఉంచుతాడు. ప్రతి శుక్రవారం చికెన్ కూర కూడా పెడతాడు. కులమతాలకు అతీతంగా ఆ ప్యాకెట్లను ఎవరైనా తీసుకోవచ్చు. అక్కడి వరకూ రాలేని కుటుంబ సభ్యులు ఉంటే వారికోసమూ ఆహార ప్యాకెట్లను తీసుకువెళ్లొచ్చు. ఎన్ని తీసుకున్నా ఎవరూ అడ్డు చెప్పరు. ఆసిఫ్ తన తండ్రి, కూతురు జ్ఞాపకార్థం ‘షకీనా ఫౌండేషన్’ను పదేళ్ల కిందట ఏర్పాటుచేశాడు. అప్పట్నుంచీ ప్రతి రోజూ రెండు మూడు వందలమంది ఆకలిని తీర్చుతున్నాడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలూ, నిరుపేదలకోసం మొదటి మూడు నెలలపాటు రోజూ పదివేల మందికి భోజనం ప్యాకెట్లూ, బియ్యం-పప్పుల్ని అందించాడు. దీనికోసం అప్పట్లో నగరంలో నాలుగు ప్రాంతాల్లో తాత్కాలిక కిచెన్లను ఏర్పాటుచేశాడు. ఆసిఫ్ ఎవరి నుంచీ విరాళాలూ, వస్తువులూ తీసుకోడు. తన శక్తిమేర తానే చేస్తానంటాడు. అంతేకాదు, ఏడాదిలో ఒకసారి మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటుచేసి పేదలకు ఉచితంగా మందులూ అందిస్తాడు. గతేడాది హైదరాబాద్‌లో భారీ వర్షాల సమయంలోనూ ఆపన్నులను ఆదుకుంది షకీనా ఫౌండేషన్.
రూ.25కే ఎంతైనా తినొచ్చు!

చెన్నైకు చెందిన 48 ఏళ్ల పాల్‌రాజ్ ఓల్డ్ పల్లవరంలో ఉండే తన ఇంటి దగ్గర రోజూ 20 మందికైనా అన్నదానం చేస్తాడు. అయితే, కొందరు ఆకలితో ఉన్నా ఉచితంగా తినడానికి ఇష్టపడకపోవడం గమనించాడు. అందుకోసమే అతనో కొత్త హోటల్ తెరిచాడు. ఈ హోటల్‌లో భోజనం ధర రూ.25 మాత్రమే. శాకాహారం, మాంసాహారం ఏదైనా తిన్నంత వడ్డించుకోవచ్చు అక్కడ. కొవిడ్ కారణంగా పేదవాళ్లే కాదు, దిగువ మధ్య తరగతివాళ్లూ ఎంతో చితికిపోయారు. తన చుట్టుపక్కల వాళ్లలో ఆ మార్పుని గమనించిన పాల్‌రాజ్ తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించి వాళ్లకు కొంతమేర సాయపడాలనుకుని ఫిబ్రవరిలో ఈ హోటల్‌ని ప్రారంభించాడు. ‘నా సంపాదనతో ఎంతో సంతృప్తిగా ఉన్నా. ఉన్నదాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నా. అయితే చాలామంది ఉచితంగా ఏదీ తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ హోటల్‌ని ఒక అద్దె భవనంలో నడుపుతున్నా. ఆ అద్దె మేరకు రూ.25 వసూలు చేస్తున్నా. లాభం అస్సలు తీసుకోను. చాలామంది టిఫిన్, రాత్రి భోజనం కూడా ప్రారంభించమని అడుగుతున్నారంటే ఇలాంటి హోటళ్ల అవసరం ఏమేర ఉందో అర్థం చేసుకోవచ్చు. త్వరలో టిఫిన్, రాత్రి భోజనం కూడా మొదలుపెడతా’ అని చెబుతాడు పాల్‌రాజ్.
- ఇదీ చదవండి : మంత్రుల పర్యవేక్షణ, ఎమ్మెల్యేలకు బాధ్యతలు