తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పూల మార్కెట్‌గా పేరుగాంచిన గుడిమల్కాపూర్ మార్కెట్లో పండుగలొస్తే చాలు పూల ధరలు ఆకాశాన్నంటుతాయి. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థికి భిన్నంగా ఉంది. బంతిపూలు, చామంతి, గులాబీ పువ్వుల ధరలు దారుణంగా పడిపోయాయి. సాధారణ రోజుల్లో బంతి పూలు..… కిలో ధర రూ. 50 నుంచి రూ.100 వరకు ఉంటుంది. పండుగ సమయాల్లో వీటి ధర రూ. 100 నుంచి రూ.200కు పెరుగుతుంది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పూలు తడిసిపోవటం వల్ల ధరలు అమాంతం పడిపోయాయి.
దిగుమతి కూడా ఎక్కువే
గత ఎండాకాలం బంతి పూలకు రూ. 150 నుంచి 200 వరకు ధర ఉంది. బంతి సాగుతో మంచి లాభాలను గడించొచ్చన్న ఆశతో రైతులు ఎక్కువ స్థాయిలో సాగు చేశారు. దిగుబడి కూడా ఎక్కువే వచ్చింది కానీ.... వానల వల్ల ధరలు పడిపోయి రైతులకు నష్టం వాటిల్లింది. హైదరాబాద్ మార్కెట్లోకి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పూలు దిగుమతి అవుతుంటాయి. స్థానిక దిగుమతితో పాటు ఇది కూడా కలిసే సరికి ధరలు విపరీతంగా పడిపోయాయి.
అప్పుడు రూ.100 ఇప్పుడు రూ.10
గతేడాది దసరా సీజన్లో రూ.100 రూపాయలు పలికిన బంతిపూల ఈ ఏడాది కిలో ధర రూ. 10 నుంచి రూ.30 మధ్యే ఉంది. క్రితం సంవత్సరం రూ. 100 పలికిన చామంతి పూలు ఇప్పుడు రూ.40 నుంచి రూ.60లకే రైతులు విక్రయిస్తున్నారు.
బతుకమ్మ ముగింపు నాటికి వాతావరణం అనుకూలించినట్లయితే పరిస్థితి మారుతుందని వ్యాపారులు చెబుతున్నారు. రైతులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు