లాక్‌డౌన్‌లో దేశమంతా ఇంటికే పరిమితమైన వేళ.. విద్యార్థుల నుంచి వ్యాపారుల దాకా అందరి కార్యకలాపాలు ఇళ్ల నుంచే సాగుతున్నాయి. సమావేశాలు, సదస్సులకు ‘జూమ్’ యాప్ కీలకంగా మారింది. అయితే ఇందులో భద్రతా సమస్యలు తలెత్తడంతో, దాని వినియోగం శ్రేయస్కరం కాదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి ప్రత్యామ్నాయాన్ని రూపొందించేందుకు దేశీయ సంస్థలకు సవాల్ విసిరింది. దాన్ని అందుకుని వేల సంఖ్యలో దరఖాస్తులు రాగా, దేశవ్యాప్తంగా 12 సంస్థల్ని ఎంపిక చేశారు. వాటిలో హైదరాబాద్‌కు చెందిన మూడు సంస్థలు ప్రొటోటైప్ తయారీకి ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తుది ఉత్పత్తి తయారీకి మరో ఐదు సంస్థల్ని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ఎంపిక చేసింది.
వీటిలో నగరానికే చెందిన పీపుల్ లింక్ యూనిఫైడ్ సంస్థ, సౌల్‌పేజ్ ఐటీ సొల్యూషన్స్ ఉన్నాయి. తదుపరి దశ కోసం ఈ రెండు సంస్థల్లో పీపుల్ లింక్ సంస్థ రూ.20 లక్షలు, సౌల్‌పేజ్ సంస్థ రూ.15 లక్షల పారితోషికం అందుకున్నాయి. వీటి నుంచి తుది విజేతను జులై 29న ప్రకటించనున్నారు. వీరికి రూ.కోటి బహుమతితో పాటు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తుంది.
దేశవ్యాప్తంగా పెద్ద సంస్థలు పోటీపడ్డాయి. కానీ మేం రూపొందించిన ప్రత్యేకతల వల్ల మొదటి అయిదింటిలో నిలిచాం. కృత్రిమ మేధ ద్వారా సమాచార భద్రతకు ప్రాధాన్యమిస్తూ యాప్‌ను రూపొందిస్తున్నాం. యాప్ ద్వారా 500 మందికి పైగా ఒకేసారి సమావేశం అవ్వవచ్చు. - వంశీ కురామా, సౌల్‌పేజ్ సీటీవో
ఇదీ చూడండి: 'తయారీలో అంతర్జాతీయంగా భారత్ పోటీపడటం కష్టమే..కానీ'