శాసనమండలి సమావేశాలు వాడీవేడిగా సాగాయి. ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైన సభ సాయంత్రం వరకు సాగింది. నూతన పురపాలక చట్టంతో పాటు మొత్తం 5 బిల్లులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నూతన చట్టంలో కొన్ని మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. సుమారు 3 గంటలకు పైగా సాగిన సభ... అనంతరం నిరవధిక వాయిదా పడింది.
తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు, నూతన పురపాలక చట్టం బిల్లు, తెలంగాణ రాష్ట్ర రుణవిముక్తి కమిషన్ సవరణ బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన నూతన పురపాలక చట్టం బిల్లును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండలిలో ప్రవేశపెట్టారు.
ఇంటి పన్ను నిర్ధరణ, ఇంటి అనుమతుల విషయంలో పారదర్శకత, సరళీకరణ కోసమే చట్టం చేశామన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని.. 75 గజాలు ఉన్నవారు ఒక్క రూపాయి మాత్రమే చెల్లించి ఇల్లు నిర్మించుకోవచ్చని తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా జీ ప్లస్ వన్ వరకు నిర్మాణం చేసుకోవచ్చన్నారు. నూతన పురపాలక చట్టం ప్రజల పక్షంగా ఉందని మంత్రులు అన్నారు. పాలన సౌలభ్యం కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
నూతన పురపాలక చట్టం మున్సిపల్ కౌన్సిల్‌ను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత లోపించిదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 65 శాతం వరకు బీసీలు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయని.. రిజర్వేషన్లు మాత్రం అందులో సగం కూడా లేవన్నారు. బీసీ గణనపై జీవన్‌రెడ్డికి, మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లకు మధ్య మాటల యుద్ధం జరిగింది. బీసీలకు కాంగ్రెసే అన్యాయం చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ చట్టంలో మార్పులు చేయాలని జీవన్ రెడ్డి పట్టుబట్టి సభ నుంచి వాకౌట్ చేశారు.
నూతన పురపాలక చట్టంలో కలెక్టర్లకు ఉద్యోగులను సస్పెండ్ చేసే అధికారం ఇవ్వడం ప్రమాదకరమని భాజపా ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి నిబంధనలు పాటించాలో తెలపాలన్నారు. తక్కువ వార్డులతో కార్పొరేషన్ ఎలా ఏర్పాటుచేస్తారని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరిగేలా నూతన పురపాలక చట్టం ఉందని.. బీసీ గణనలో అవకతవకలు జరిగాయన్నారు. వైద్య కళాశాల ఆచార్యులతో పాటు ఆయుష్ శాఖలో పనిచేసే వారికీ పదవీ విరమణ వయసు సడలించాలని కోరారు.
సుమారు 3 గంటలపాటు అధికార, విపక్షాల మాటల యుుద్ధాలతో సాగిన సమావేశాలు అనంతరం నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఇవీ చూడండి: ముగిసిన సమావేశాలు... 5 బిల్లులకు ఆమోదం