ఉత్తమ పనితీరు కనపర్చిన తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య(టీఎస్‌ఎఫ్‌సీఎఫ్)కి కేంద్ర పురస్కారం లభించడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ మత్స్య దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21న దిల్లీలో జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఆధ్వరంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి చేతుల మీదుగా పశుసంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర ఈ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ పురస్కారంతో పాటు రూ.5 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఇన్ ల్యాండ్ కేటగిరి- సముద్రేతర ప్రాంతాల్లో మత్స్య రంగ అభివృద్ధి కింద ఈ పురస్కారం రాష్ట్రానికి లభించడం విశేషం. ఈ పురస్కారం లభించిన సందర్భంగా మత్స్య శాఖ అధికారులు సీఎస్‌ను కలిశారు.
రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం లాంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, చెరువులు, ఇతర నీటి వనరుల్లో పెరిగిన నీటి లభ్యత వల్ల చేపలు, రొయ్యల పెంపకానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని సీఎస్ పేర్కొన్నారు. మత్స్య శాఖ అధికారులు భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహన్ని కొనసాగిస్తూ ఈ శాఖ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: 'అమ్మ కోసం అత్తింట్లో దొంగతనం... పట్టించిన సీసీ కెమెరాలు'