ప్రస్తుతం సాంకేతికతే రాజ్యమేలుతోంది. ఆటోమోబైల్ రంగం ఆధునిక సాంకేతికతను ఆలశ్యంగా అందుకున్నా, వేగంగా అభివృద్ధి చెందుతోంది. మానవరహిత స్వయంచాలిత వాహనాలదే భవిష్యత్. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం అభివృద్ధి చెందిన దేశాలకు కూడా మార్గదర్శకంగా ఉండేలా 2018లో జాతీయ మిషన్ ప్రారంభించింది. ఇందు కోసం శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పరిశోధనల కోసం 3000కోట్ల రూపాయలు కేటాయించింది. దేశ వ్యాప్తంగా స్వయం ప్రతిపత్త వాహనాలపై పరిశోధనలు నిర్వహిస్తున్న 15సంస్థలను గుర్తించి వాటికి ఈ నిధులను మంజూరు చేశారు.
కొత్త కోర్సులకు అవకాశం
ఈ ప్రాజెక్టును దక్కించుకున్న ఐఐటీ హైదరాబాద్ టైహాన్ పేరుతో అటానమస్ నావిగేషన్ అండ్ డాటా అక్వజైషన్ సిస్టమ్స్ పై పరిశోధనలు చేయడానికి కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఈ తరహా పరిశోధనల కేంద్రం దేశంలోనే మొట్టమొదటిది ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం విశేషం. ఇందు కోసం 5సంవత్సరాల కాలపరిమితితో 135కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఐఐటీ హైదరాబాద్ లో పరిశోధనల మౌళిక వసతులు కల్పనతో పాటు కొత్త కోర్సులకు అవకాశం ఏర్పడింది. టైహాన్ ను లాభాపేక్షలేని కంపెనీగా రిజిస్టర్ చేశారు. స్మార్ట్ మోబిలిటీలో ఎంటెక్ కోర్సును ఇందులో భాగంగా ప్రారంభించారు.
శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి
పరిశోధనల కోసం టెస్టింగ్ బెడ్ నిర్మాణానికి మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ శంకుస్థాపన చేశారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించే వాహనాలపై పరిశోధనలు చేయడానికి కేంద్రాన్ని నిర్మించనున్నారు. 18నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆచార్యురాలు రాజలక్ష్మి ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఏరోస్పేస్, సివిల్, గణిత, డిజైన్ విభాగాలు పరిశోధనల్లో పాలుపంచుకోనున్నారు. మానవసహిత, మానవరహిత వాహనాలు, డ్రోన్లపై సమిష్టిగా భౌతిక, సాంకేతిక పరమైన అంశాల్లో పరిశోధనలు చేయనున్నారు. టైహాన్ టెస్ట్ బెడ్లో పరిశోధనల ద్వారా అత్యాధునిక సాంకేతిక వాహనాలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు, సురక్షిత ప్రయాణం కోసం విధివిధానాలు రూపొందిస్తారు. పరిశోధనల్లో పాలుపంచుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, విద్యాసంస్థలతో ఒప్పంద కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే జపాన్ కు చెందిన సుజికీ మోటార్ కార్పోరేషన్, మారుతి ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఐఐటీలో ఏర్పాటు చేసిన టెస్ట్ బెడ్‌ను ఆటోమోబైల్ పరిశ్రమలు సైతం పరిశోధనలకు వినియోగించుకోనున్నాయి.. దీంతో ఐఐటీకీ అదనపు ఆదాయం సైతం సమకూరనుంది.
ఆటోమోబైల్ రంగంలో అత్యాధునిక సాంకేతికతకు... ఐఐటీ హైదరాబాద్ అతి త్వరలో వేదిక కానుంది.
ఇదీ చదవండి: కృష్ణానదిలో ఒళ్లు గగుర్పొడిచే సాహస యాత్రలు