First day Rythu Bandhu: రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు 18 లక్షల 12 వేల 656 మంది రైతుల ఖాతాలో 544.55 కోట్లు నగదు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచానికి, దేశానికి రైతుబంధు, రైతుబీమా పథకాలు ఒక దిక్సూచిగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తోన్న వ్యవసాయ అనుకూల పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందని మంత్రి కొనియాడారు. రైతులకు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు.
7,645 కోట్లకు పైగా సాయం
ఈసారి 94 వేల మందికి చెందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ప్రకారం ఉన్న 3.05 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం ఇవ్వనున్నారు. మొత్తంగా ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు చెందిన కోటి 52 లక్షల 91 వేల ఎకరాలకు సాయం అందిస్తారు. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున 7,645 కోట్ల 66 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 61.08 లక్షల మందికి 7,377 కోట్ల రూపాయలు రైతుబంధు సాయంగా అందించారు. యాసంగి సీజన్లో లబ్ధిదారుల సంఖ్య 66.61 లక్షలకు పెరిగింది. వారికి రూ.7,645 కోట్లకు పైగా సాయం అందనుంది.
ఒక్కో ఎకరా పెంచుకుంటూ ఆరోహణ క్రమంలో..
తక్కువ భూవిస్తీర్ణం కలిగిన వారితో ప్రారంభించి ఆరోహణా క్రమంలో సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ఇవాళ ఒక ఎకరం లోపుతో ప్రారంభించి రోజుకు ఒక ఎకరా చొప్పున పెంచుకుంటూ పోతారు. మంచిరోజు అన్న ఉద్దేశంతో శుక్రవారం రోజే పది మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. వచ్చే నెల మొదటి వారంలో రైతుబంధు చెల్లింపుల ప్రక్రియ పూర్తి కానుంది.
ఇదీ చూడండి: