రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ( Job vacancies in Telangana ) 67 వేలకు పైగా ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదిక సిద్ధం చేసింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో మేలో శాఖల వారీగా వివరాలు సేకరించారు. మొత్తం 52 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు అప్పట్లో మంత్రిమండలికి నివేదించారు. ఆ జాబితా సక్రమంగా లేదని, సమగ్ర సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశించడంతో ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేశాయి.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో జులై 19న మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్ సమీక్షించారు. ఆయా శాఖలు రూపొందించిన నివేదికలను పరిశీలించారు. శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది వివరాలను కూడా ప్రత్యేకంగా పొందుపరిచారు. కసరత్తులో భాగంగా దశాబ్దాల క్రితం నాటి ఉత్తర్వులను కూడా అధికారులు పరిశీలించారు.
గత మంత్రిమండలి భేటీలో ముసాయిదా నివేదిక ఇచ్చాయి. ఆ ప్రాతిపదికన వివరాలు ఇవ్వాలని సీఎం (CM KCR) అప్పట్లో సూచించడంతో.. అన్ని శాఖలు ప్రక్రియ పూర్తిచేసి గత వారం నివేదిక సమర్పించాయి. అన్నింటినీ క్రోడీకరించగా 67,820 ఖాళీలు తేలాయి. 50 వేల ఉద్యోగాలను ( Job vacancies in Telangana ) తక్షణమే భర్తీ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ (CM KCR) ఇప్పటికే ఆదేశించారు. పూర్తి జాబితాను ఈ నెలలో జరిగే మంత్రిమండలి ( Telangana Cabinet) సమావేశంలో సమర్పించనుంది. మంత్రివర్గం ఆమోదం అనంతరం నోటిఫికేషన్లకు ప్రభుత్వం అనుమతించే వీలుంది.
ఇదీ చదవండి : అంగన్వాడీ కేంద్రాలు సహా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పునఃప్రారంభం