Palle pragathi in Rangareddy: గ్రామసీమలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతూ... ప్రణాళికాభివృద్ధే ధ్యేయంగా రంగారెడ్డి జిల్లాలో మరో దఫా పల్లె ప్రగతి కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధికి 15రోజుల పాటు చేపట్టే వివిధ కార్యక్రమాలను దిగ్విజయం చేసేందుకు సర్పంచ్‌లంతా సిద్దంగా ఉన్నారని తెలిపారు.
గ్రామాల్లో చేపట్టిన పనులకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో కొంతమంది సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారన్నారు. కొన్ని గ్రామాల్లో కాంట్రాక్టర్లు పనులు చేయించారని, వారికి బిల్లులు ఎలా రాబట్టుకోవాలో తెలుసు కాబట్టి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. మరికొన్ని ఊళ్లలో సర్పంచ్‌లు కాంట్రాక్టులు తీసుకుని పనులు చేయించారని, వారికి బిల్లుల ప్రాసెస్ తెలియకపోవడంతో పెట్టిన డబ్బులు తిరిగిరాక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఉపాధి హామీ కింద చేపట్టిన పనులకు బిల్లులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఎఫ్ఆర్బీఎం కింద 4శాతం రుణ పరిమితికి అవకాశం ఉన్నా... రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో నిధులు సమకూరడంలేదని అన్నారు. బ్యాంకులకు ఆర్‌బీఐ ఎలాంటి సూచనలు చేయకపోవడంతో అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణ బాధ్యతను పంచాయతీరాజ్‌శాఖ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడాన్ని సర్పంచ్‌లు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఎంపీవోలకు గ్రామాలే జీతాలు ఇవ్వాలన్న ఆదేశాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు.
ఇవీ చదవండి:CM KCR : 'తెలంగాణ సజల, సుజల, సస్యశ్యామలంగా మారింది'