ఆ పేద రైతుకు కాడెడ్లు కొనే ఆర్థిక స్తోమత లేదు... కానీ దుక్కి దున్నాల్సిందే.. పంట పండించాల్సిందే.. కుటుంబాన్ని పోషించాల్సిందే. ఏం చేయాలా? అని తల పట్టుకున్నాడు. అప్పుడు అతనికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఇంట్లో పెంచుకుంటున్న పొట్టేలును పొలానికి తీసుకువెళ్లాడు. అరక కట్టాడు. కూతురి చేతికి పొట్టేలు మెడలో వేసిన తాడు ఇచ్చాడు. భార్య నాగలి పట్టింది. పొట్టేలుతో సహా మొత్తం ఆ కుటుంబం దుక్కి దున్నింది. ఈ దృశ్యాలు వారి దుస్థితికే కాదు.. అన్నదాతల సామాజిక, ఆర్థిక పరిస్థితులకు దర్పణం పడుతోంది.
ఏపీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన రంజాన్ అనే రైతు.. తనకున్న ఎకరం పొలంలో పత్తి పంట వేశాడు. కలుపు పెరిగిపోవడంతో వాటిని తొలగించేందుకు కాడెడ్లతో దున్నాలని భావించాడు. కానీ అందుకు వెయ్యి రూపాయలు అడగడంతో అంత చెల్లించుకోలేకపోయాడు. దీంతో తాను పెంచుకుంటున్న పొట్టేలు సహాయంతో పత్తిలో కలుపు తీశాడు. పొట్టేలు పొలంలో ముందుకు నడవకపోవడంతో.. తన పిల్లలతో పొట్టేలు నోటికి మేత అందిస్తూ ముందుకు నడిపించాడు. అతని భార్య నాగలి పట్టుకోగా.. వారిని అనుసరిస్తూ పొట్టేలు పొలం దున్నింది.
ఇదీ చదవండి: NEW PLANT: అనంతగిరి కొండల్లో కొత్త జాతి మొక్కను గుర్తించిన శాస్త్రవేత్తలు