రాష్ట్రంలో వేరుశనగ పంట సాగు విస్తృతికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మోర్బీ జిల్లా అలువద్ తాలూకా సుఖ్‌పూర్ గ్రామ రైతులు అజీద్ భాయ్, జుగ్మాల్ భాయ్ వేరుశనగ క్షేత్రం, మోర్బీ సమీపంలో బోన్‌విల్లే ఫుడ్స్ లిమిటెడ్ సంస్థను మంత్రి సందర్శించారు. వేరుశనగ ఆధారిత ఉత్పత్తులను పరిశీలించారు. మంత్రి వెంట టీఎస్ సీడ్స్ అభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, గుజరాత్ ఉద్యాన శాఖ సంయుక్త సంచాలకులు చావ్డా ఉన్నారు.
గుజరాత్‌తో పోల్చుకుంటే తెలంగాణ వేరుశనగ విత్తన నాణ్యత అధికంగా ఉంటుందన్నారు. గుజరాత్‌లో అక్టోబర్ నుంచి చలి తీవ్రత వల్ల వర్షాకాలంలోనే వేరుశనగ సాగుకు అవకాశముంటుందన్నారు. ఫలితంగా ఎంత దిగుబడి సాధించినా అఫ్లాటాక్సిన్ ఫంగస్ రహిత (శిలీంధ్రం) వేరుశనగ దిగుబడి అసాధ్యమని చెప్పారు. తెలంగాణలో యాసంగిలో వేరుశనగ సాగుకు సంపూర్ణ అవకాశాలు ఉండటంతో.. అక్టోబర్‌లో వేరుశనగ విత్తుకుంటే జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటి వారం లోపు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటకుండానే పంట చేతికి వస్తుందని వివరించారు.
దేశంలో యాసంగిలో వేరుశనగ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న మంత్రి.. ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వల్ల విస్తృత ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయన్నారు. గుజరాత్‌లో ఖరీఫ్‌లో.. 54 లక్షల ఎకరాల్లో వేరుశనగ, మరో 56 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతున్న దృష్ట్యా ఆ మొత్తం వాతావరణ, వర్షపాత పరిస్థితుల ప్రకారం 8 జోన్లుగా వ్యవసాయ శాఖ విభజించిందని తెలిపారు. గుజరాత్‌లో 2.42 కోట్ల ఎకరాల సాగు భూమి, కోటి 19 లక్షల ఎకరాలకు సాగు నీటి సదుపాయం ఉందన్నారు. అదే తెలంగాణలో పెరిగిన సాగు నీటి వసతుల నేపథ్యంలో స్పష్టమైన ప్రణాళికలతో రైతులను సాంప్రదాయ పంటల నుంచి బయటకు తీసుకురావాలని కృషి చేస్తున్నట్లు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే తెలంగాణ దశ మారిపోతుందన్నారు.
వరి సాగు నుంచి రైతులు బయటకు రావాలని... గిరాకీ ఉన్న పంటల సాగు ప్రోత్సహించడం సహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో వ్యవసాయ స్వరూపం సమూలంగా మార్చివేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీచూడండి: CM KCR Speech: 'సాగర్‌కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'