ఏపీలోని నరసరావుపేట సబ్ జైలులో ఉన్న కృష్ణాయపాలెం రైతులను పోలీసులు గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. రైతులకు సంకెళ్లు వేసి మంగళవారం ఆర్టీసీ బస్సులో జిల్లా జైలుకు తీసుకుని వచ్చారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, అమరావతి ఐకాస నాయకులు సుధాకర్, గుంటూరు పశ్చిమ తెదేపా సమన్వయకర్త కోవెలమూడి రవీంద్రలతో పాటు పలువురు నాయకులు... రైతులను జిల్లా జైలు వద్ద పరామర్శించేందుకు వచ్చారు. కర్షకులకు సంకెళ్లు వేయటం పట్ల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం సరికాదని దుయ్యబట్టారు. ఇటువంటి దుశ్చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.
రైతుల చేతికి సంకెళ్లు వేశారంటే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. రైతులపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించడం లేదు.
- ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీమంత్రి
వైకాపా ప్రభుత్వం దుర్మార్గ చర్యలను మానుకోవాలి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు. - కోవెలమూడి రవీంద్ర(నాని), గుంటూరు పశ్చిమ తెదేపా సమన్వయకర్త
ఇదీ చూడండి: దొరికిన డబ్బులపై భాజపా నాయకుల పూటకో మాట: హరీశ్ రావు