రాష్ట్రంలో ఉద్యానపంటల సాగుకు అపార అవకాశాలు ఉన్న దృష్ట్యా రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానశాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి సూచించారు. మామిడి, జామ, దానిమ్మ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ నుంచి దృశ్య మాద్యమ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు నుంచి జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎంఆర్ దినేష్, శాస్త్రవేత్తలు డాక్టర్ రెజు కురిఒస్, డాక్టర్ డీఎల్ మంజునాథ్, డాక్టర్ లింటా విన్సెంట్, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యాన రంగానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం... మామిడి, జామ, దానిమ్మ, బొప్పాయి తోటల సాగు విస్తీర్ణం పెరగడంపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలో 4లక్షల ఎకరాల విస్తీర్ణంల్లో పండ్ల తోటలు సాగులో ఉండగా... అందులో 3 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోందని వెంకటరామిరెడ్డి తెలిపారు. కొత్త పండ్ల రకాలు, సాగు పద్ధతులు రైతుల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సిద్ధిపేట జిల్లా ములుగులో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటైందని వివరించారు. సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతులు అవలంభిస్తే రైతులు చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలుగా అవరించవచ్చని డాక్టర్ దినేష్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చని, రైతులు లాభాలు పొందవచ్చన్నారు.
రాష్ట్రంలో పండ్ల తోటల విస్తీర్ణం, దిగుబడి, మార్కెటింగ్, వినియోగం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, చీడపీడల నియంత్రణ వంటి అంశాలపై ఉద్యాన శాఖ ఉప సంచాలకులు బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మామిడి, దానిమ్మ, జామ సాగులో మొక్కల ఎంపిక, అనుకూలమైన వాతావరణం, నేలలు, నీరు, రసాయన ఎరువుల యాజమాన్యం, కొమ్మల కత్తిరింపు వంటి పద్ధతులు రైతులు పాటించాలని ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు సూచించారు. ప్రత్యేకించి జామ, దానిమ్మలో తీసుకోవాల్సిన బాహర్ పద్ధతి, చీడపీడల నియంత్రణ, నాణ్యమైన మొక్కల ఉత్పత్తి వంటి అంశాలు తెలియజేశారు.