Farmers Protest: రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో లోపభూయిష్ఠ సాంకేతికతను నిరసిస్తూ రైతాంగం పోరుబాట పట్టింది. ధరణి పోర్టల్‌లో తప్పుల తడకలున్నాయంటూ హైదరాబాద్ అబిడ్స్ భూపరిపాలన కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు హైదరాబాద్‌లోని భూపరిపాలన కార్యాలయం ముట్టడించారు.
కార్యాలయం ఎదుట బైటాయించి ప్రభుత్వం, భూపరిపాలన శాఖ వైఖరిని నిరసించారు. సర్కార్ పారదర్శకతకు మారు పేరు అంటున్న ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న అనేక తప్పులు రైతులకు తిప్పలు అంటూ బాధిత రైతులు ఆక్షేపించారు. అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా పరిణమించిందంటూ ధ్వజమెత్తారు. 60 ఏళ్ల పట్టాలు కలిగి ఉండి.. నేటికీ సాగులో ఉన్న 1,827 ఎకరాల విస్తీర్ణం భూమికి సంబంధించిన నూతన పట్టాదారు పాసుపుస్తకాల కోసం గత మూడు సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నామని వాపోయారు.
భూప్రక్షాళన పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల జారీలో జాప్యం కారణంగా.. రైతుబంధు, రైతుబీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, సంస్థాగత రుణాలు, పంట బీమా పరిహారం వంటివేమీ తాము నోచుకోవడం లేదని నారాయణపురం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
'మాకు 1960 నుంచి 2016-17 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉండి.. అన్ని రకాలుగా లబ్ధి పొందాం. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్త పాసుపుస్తకాల కోసం ఆప్లై చేసుకోవాలని చెప్పింది. అప్పుడు మేము దరఖాస్తు చేసుకుందామంటే మా భూమి ఫారెస్ట్ రిజర్వ్‌లో చేర్చారు. ఆ రోజు నుంచి మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. సీఎం ఆదేశాల మేరకు ఐదు బృందాలతో గ్రామంలో సర్వే చేయించారు. సర్వేలో తేలిన 1827 ఎకరాలకు తప్పకుండా పాసుపుస్తకాలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో ధరణిలో 116మంది పేర్లు మాత్రమే చూపిస్తుంది అంటున్నారు. తక్షణమే సర్వేలో తేలిన మా అందరికీ పాసుపుస్తకాలు ఇవ్వాలి.'-బాధిత రైతులు, నారాయణపురం
'ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాకు పట్టాలు ఉండేవి. ఎస్సారెస్పీ కెనాల్ మా గ్రామం గుండా వెళ్లినప్పుడు లోన్లు తీసుకున్నాం. అప్పుడు పంటలు గిట్టుబాటు ధరలకు అమ్ముకున్నాం. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం భూప్రక్షాళన పేరిట గ్రామంలో సర్వే చేయించింది. అప్పటినుంచి మా పాసు పుస్తకాలు పనిచేయట్లేదు. 1827 ఎకరాల భూమి సర్వే చేయించారు. దాంట్లో మా పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ధరణిలో చేర్చాలంటే మా పేర్లు చూపిస్తలేవు. అది పరిష్కరించి మాకు పట్టాలివ్వాలి.'- బాలాజి, బాధిత రైతు
ఇవీ చదవండి:Horticulture in TS: రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు.. బిందుసేద్యంతో సాంకేతిక పరిజ్ఞానం