ఎవరు ఏ పని ప్రారంభించినా ముందస్తు ప్రణాళిక కావాలి. అదే సూత్రం ఆర్థిక అంశాలకూ వర్తిస్తుంది. ప్రణాళిక లేకుండా ఆర్థికంగా విజయం సాధించడం కష్టం
- కౌటిల్యుడి అర్థశాస్త్రం
కౌటిల్యుడి గురించి, ఆయన రాసిన అర్థశాస్త్రం గురించి తెలియకపోయినా.. అమ్మమ్మలు, తాతల కాలంలో ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. కుటుంబానికో బడ్జెట్ రూపొందించుకునేవారు. రాతల రూపంలో కాకపోయినా సంపాదనను ఎలా ఖర్చుపెట్టాలి, దేనికెంత వెచ్చించాలో లెక్కలు వేసుకుని పక్కాగా ముందుకెళ్లేవారు. అవసరాలు తీర్చుకుంటూనే ఎంతోకొంత పొదుపు చేసుకుంటూ ఆ సొమ్ముతో బంగారమో, ఆస్తులో కొనుగోలు చేసేవారు. ఒకట్రెండు తరాల ముందు వారి జీవన విధానాన్ని గమనించినా గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
కరోనా కారణంగా చాలా కుటుంబాల రాబడుల్లో 20 నుంచి 30 శాతం తగ్గినట్టు అనేక సర్వేలు వెల్లడిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటితరం కూడా ఆ సూత్రాన్ని అనుసరించక తప్పదని అనుభవజ్ఞులు, ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. వారి ఆదాయానికి అనుగుణంగా కుటుంబ బడ్జెట్‌ను రూపొందించుకుంటేనే ఒడుదొడుకుల సమయంలో తట్టుకుని ముందుకెళ్లొచ్చని సూచిస్తున్నారు. ఖర్చులను అదుపులో ఉంచుకుని, ఎంతోకొంత పొదుపు పాటిస్తే అది విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేయడంతోపాటు కుటుంబంపై వ్యతిరేక ప్రభావం లేకుండా చూస్తుందని స్పష్టంచేస్తున్నారు.
ఫ్యామిలీ బడ్జెట్ రూపకల్పన.. కొన్ని సూచనలు
- బడ్జెట్‌ను మనల్ని నియంత్రించే అంశంగా భావించకూడదు. మన ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చే సాధనంగా చూడాలి.
- సగటు ఆదాయం, ఖర్చులను నిజాయతీగా విశ్లేషించి రూపొందిస్తేనే ప్రభావవంతమైన కుటుంబ బడ్జెట్ రూపకల్పన సాధ్యం.
- ప్రతి నెలా నిర్దిష్ట ఆదాయం వచ్చే వృత్తిలో లేనివారు, గత ఏడాదిలోని ఓ నెలలో అత్యంత తక్కువ సంపాదించిన మొత్తాన్ని ఆధారంగా చేసుకుని ప్రణాళిక రూపొందించుకోవాలి.
- ఆదాయం కన్నా ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్న పక్షంలో కేవలం నెలనెలా మారే నిత్యావసరాల ఖర్చులతోపాటు, కచ్చితంగా చేయాల్సిన ఖర్చునూ తగ్గించుకుంటూ వెళ్లక తప్పదు.
- ఆధునిక కాలంలో ఆన్‌లైన్, కార్డుల ద్వారా ఖర్చులు చేస్తున్న పరిస్థితుల్లో ఈ తరహా అప్రమత్తత అత్యవసరం.
ఉత్తమ ఆర్థిక ప్రణాళిక ఇలా
క్రెడిట్ కార్డుల వంటి పాత, చిన్నచిన్న అప్పులు తీర్చడంతోపాటు పొదుపు, ఆరోగ్యకార్డులు, పిల్లల భవిష్యత్తు చదువులు, పదవీ విరమణ ప్రణాళికలు, పెట్టుబడులకు కలిపి మొత్తంగా సంపాదనలో 25 శాతం వరకు వెచ్చించగలగడాన్ని ఉత్తమ ఆర్థిక ప్రణాళికగా నిపుణులు పేర్కొంటున్నారు. మదుపు చేసిన మొత్తంలో పెట్టుబడులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనేది వారి సూచన.
సంపద పెరిగే మార్గాలే మేలు
పొదుపు తాలూకూ సొమ్మును నికరంగా పెంచుకుంటూ వెళ్లే ప్రణాళిక ఉండాలి. సరైన పెట్టుబడి మార్గాలు అన్వేషించడం ద్వారా ఆ లక్ష్యాలు సాధించాలి. ముఖ్యంగా పెట్టుబడులు మనకు నష్టం కలిగించేలా, భారం పెంచేలా ఉండకూడదు. భార్యాభర్తలిద్దరూ కుటుంబ బడ్జెట్‌లో పాత్రధారులుగా ఉండాలి. ఇద్దరూ ఉద్యోగులైనా, ఒకరే సంపాదిస్తున్నా ఆర్థిక ప్రణాళికను మాత్రం కలిసే రూపొందించుకోవాలి.
అనుభవజ్ఞులు ఏం చెబుతున్నారంటే..
తన తల్లి నుంచే తాను ఫ్యామిలీ బడ్జెట్ తయారుచేసుకోవడం నేర్చుకున్నానని చెబుతున్నారు రాజమహేంద్రవరానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు. ‘చిన్నప్పుడు కిరాణా సరకులు కొనే క్రమంలో అమ్మ మొదట ఆ తాలూకూ వస్తువుల జాబితా రాసిచ్చేది. ధరలు నమోదు చేయించి తీసుకురమ్మనేది. తెచ్చిన తర్వాత దానికోసం కేటాయించిన మొత్తంతో ధరలను పోల్చిచూస్తూ ప్రాధాన్యం ప్రకారం జాబితా ఖరారు చేసి, ఆ మేరకే సరకులు కొనేది. ఆమె నుంచే నాకు ప్రణాళికాబద్ధంగా, ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేసుకోవడం అలవడింది’ అని ఆయన తెలిపారు.
వస్తువులు అంటే ఇష్టమే తప్ప వ్యామోహం ఉండకూడదని, కుటుంబ నిర్వహణలో ఇది కీలకమని విజయవాడకు చెందిన గృహిణి సౌభాగ్య తెలపగా, ‘నెలవారీగా ఖర్చుల వివరాలు డైరీలో రాయడం అలవాటు. కిరాణా సరకులు సహా ఏది కొనాలన్నా నేనే బజారుకు వెళ్లేదాన్ని. నెలాఖరున డైరీని పరిశీలించినప్పుడు సరకులు తెచ్చే క్రమంలో రాకపోకలకు ఆటోల రూపంలో ఖర్చు బాగా ఎక్కువైనట్టు గుర్తించా. అప్పట్నుంచి నెలవారీగా అవసరమయ్యే వస్తువుల జాబితాను ముందే సిద్ధం చేసుకుని ఒక్కసారిగా వీలైనన్ని కొనుగోలు చేయడం ప్రారంభించాం. ఆ రూపేణా చాలా ఖర్చు తగ్గిందని’’ హైదరాబాద్‌కు చెందిన మరో గృహిణి చెప్పారు. మొత్తం ఖర్చును నెల చివర్లో సమీక్షించుకుంటే వృథాను తగ్గించుకోవచ్చని ఆమె అన్నారు.
కుటుంబం అండగా నిలవాలి
కష్టకాలంలో ఆదాయం తగ్గిన, ఆర్థిక ఒడుదొడుకులు వచ్చిన సందర్భాల్లో ఇంటి సభ్యులంతా కుటుంబ పెద్దకు అండగా నిలవాలి. పరిస్థితుల నుంచి బయటపడేందుకు తమవంతు సాయం అందించాలి. అనవసర ఖర్చుల జోలికిపోకుండా ఖర్చులను నియంత్రించుకోవాలి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంత ఎక్కువ మద్దతు ఇస్తే అంత త్వరగా ఆ కుటుంబం కోలుకుంటుంది. తద్వారా వారి మధ్య బంధాలూ బలపడతాయి
సహకరించేందుకు సంస్థలు, యాప్‌లు...
అమెరికా వంటి దేశాల్లో దిగువ, మధ్య తరగతి ప్రజానీకం కుటుంబ బడ్జెట్ సిద్ధం చేసుకునేందుకు అవసరమైన సలహాలు అందించే సంస్థలు ఉన్నాయి. దాని రూపకల్పనకు సంబంధించిన యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. పరిమితికి మించి ఖర్చుచేస్తే అప్రమత్తం చేసే యాప్‌లు పలు దేశాల్లో వినియోగంలో ఉన్నాయి.
ఐదు కేటగిరీల బడ్జెట్
పౌలాపంట్ అనే విదేశీ ఆర్థిక నిపుణురాలు ఫ్యామిలీ బడ్జెట్ తయారీని ఐదు విభాగాలుగా విభజించారు
ఇంటి నిర్వహణ
ఓ కుటుంబం తమ నెల ఆదాయంలో 35 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. ఇంటి అద్దె, ఒకవేళ ఇంటి రుణం తీర్చాల్సి ఉంటే అదీ ఇందులోనే ఉండాలి. సరకులూ దీని పరిధిలోనే ఉండాలి. ఇంటి తాలూకూ మరమ్మతులు తదితరాలూ ఇందులోనే.
రవాణా ఖర్చులు
ఇది ఆదాయంలో 15 శాతానికి మించకూడదు. వాహనాల తాలూకూ రుణం తీర్చాల్సి ఉంటే అదీ, నెలవారీగా దాన్ని నడిపేందుకు అయ్యే చమురు వినియోగపు ఖర్చు, ఇతర రవాణా వ్యయాలు, ఆయా వాహనాల నిర్వహణ(బీమా, సర్వీసింగ్ సహా)ను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ ఖర్చును దీనికే పరిమితం చేయాలి.
రోజువారీ వ్యయాలు
కేబుల్, సెల్‌ఫోన్ బిల్లులు, నెలవారీ సబ్‌స్క్రిప్షన్, సినిమాలు, రెస్టారెంట్లకు వెళ్లడం, విహారాలు, దుస్తుల కొనుగోలు, ఇతరత్రా చిల్లర ఖర్చులన్నీ ఈ విభాగం కిందికి వస్తాయి. మొత్తమ్మీద ఇవన్నీ 25 శాతం లోపే ఉండాలి.
పొదుపు
సాధారణంగా కుటుంబాల వారీగా ప్రాధాన్యాలు మారిపోవచ్చు. ఆదాయాలు వేర్వేరుగా ఉండొచ్చు. ఏ స్థాయి ఆదాయం ఉన్నా 20 శాతం పొదుపునకు కేటాయిస్తే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుంది.
చిన్న రుణాల చెల్లింపు
క్రెడిట్ కార్డు వంటి పాత, చిన్నచిన్న అప్పులు తీర్చడానికి, ఆరోగ్యకార్డులకు 5 శాతమే వెచ్చించాలి.
పరిస్థితులను అధిగమించేందుకు పది సూత్రాలు
1. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం తగ్గిన వారు, జీతాలురాని వారు తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టే పెట్టుబడులను, పదవీ విరమణ ప్రణాళికల తాలూకూ పెట్టుబడులను వాయిదా వేసుకోవచ్చు.
2. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉంటే వాటిపై రుణం పొంది, వీలైనప్పుడు ఆ మొత్తం తిరిగి చెల్లిస్తే వడ్డీ భారం తగ్గుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్ డ్రాఫ్టు సౌలభ్యమూ ఉంటుంది.
3. ఆర్డీలు, జీవిత బీమా పాలసీలపైనా రుణాలు పొందే వెసులుబాటుంది.
4. వ్యక్తిగత రుణం తీసుకోదలచిన వారు వడ్డీరేట్లు సహా సంస్థల విశ్వసనీయతను చూడాలి.
5. వ్యాపారాల్లో నిర్వహణ కష్టాలు ఉండి అదనపు మొత్తాలు సర్దుబాటు చేయలేకపోతే వాటాదారులను చేర్చుకోవడం మేలు.
6. సరదా షాపింగ్‌లకు దూరంగా ఉండాలి. అనవసర కొనుగోళ్ల జోలికి వెళ్లకూడదు.
7. విహారయాత్రలకు వెళ్లలేకపోతున్నామనే చింత వద్దు. అది వ్యయంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యపరంగానూ మంచిది కాదు. సమీపంలోని చూడదగ్గ ప్రవేశాలకు వెళ్లి సరదాగా గడపడం ఉత్తమం.
8. ఇంటి వాతావరణానికి దూరంగా గడిపేందుకే ఎక్కువ మంది రెస్టారెంట్లకు వెళ్తారు. ఇంట్లోనే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుచుకుని, అలాంటి ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేసుకుంటే డబ్బు మిగులుతుంది.
9. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడటానికి మూడేళ్ల వరకు పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అప్పటివరకు సహనంతో ముందుకెళ్లాలి.
10. కొత్త వస్తువు కొనాలనే ఆలోచన వచ్చిన తర్వాత వారం రోజులు ఆగాలి. ఆ తర్వాత ఇది అవసరమా? అత్యవసరమా? కొనుగోలు చేయకున్నా ఇబ్బంది లేదా? అనే అంశాలు గుర్తించాలి. అప్పటికీ తప్పనిసరి అయితేనే కొనాలి.
పదేళ్లకోసారి వచ్చే విపత్తుకు..ప్రణాళికే పరిష్కారం
ప్రపంచంలో ఏడు నుంచి పదేళ్లకు ఒకసారి ఆర్థిక పరిస్థితులను తారుమారుచేసే లేదా తీవ్రమైన ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నాయి. గతంలో వచ్చిన ఆర్థికమాంద్యం, తాజాగా వచ్చిన కరోనా ఆ కోవలోవే. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు, ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కుటుంబ ఆర్థిక ప్రణాళిక అత్యంత కీలకం. అదే మనల్ని ఇటువంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేస్తుంది. కుటుంబాన్నీ కాపాడుతుంది.
- డాక్టర్ మణి పవిత్ర, ఫార్చ్యూన్ అకాడమీ, మిలియన్ మమ్స్ వ్యవస్థాపకులు