ఆంధ్రప్రదేశ్ అనంతపురం వేణుగోపాల్‌నగర్‌లో నివసిస్తున్న అంబటి తిరుపాల్‌శెట్టికి అక్క విజయలక్ష్మి, చెల్లెలు కృష్ణవేణి ఉన్నారు. వీరు అవివాహితులు. వారి తండ్రి 2016లో, తల్లి 2017లో అనారోగ్యంతో చనిపోయారు. దీంతో వారు మానసికంగా బాగా కుంగిపోయారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారు. వారి తల్లిదండ్రులు బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుల వడ్డీని నెలకోసారి తిరుపాల్ తెచ్చుకుంటారు.
ఆయనే రోజూ అరగంటపాటు బయటకెళ్లి కావాల్సిన భోజనాలు, తాగునీరు తెస్తారు. ఆ తరువాత ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకుంటారు. బిల్లు చెల్లించకపోవడంతో రెండేళ్ల కిందట విద్యుత్తు అధికారులు ఇంటికి సరఫరా నిలిపేశారు. అప్పటినుంచి రాత్రిళ్లు చీకట్లోనే గడుపుతున్నారు. దీన్ని గమనించి పలువురు కాలనీవాసులు శుక్రవారం వారి ఇంటి వద్దకెళ్లి బలవంతంగా తలుపులు తెరిపించారు.
మూడేళ్లుగా బయటకు రాకపోవడంతో మహిళలిద్దరి జుత్తు జడలు కట్టాయి. మాసిన దుస్తులు, మురికిదేహాలతో కనిపించారు. తమ అమ్మానాన్న చనిపోయాక కుంగుబాటుకు లోనయ్యామని, జనజీవనంలోకి రావడానికి ప్రయత్నిస్తామని బాధితుడు తిరుపాల్‌శెట్టి తెలిపారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించుకుంటామని అన్నారు.
ఇవీ చూడండి: వారి త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలి: గవర్నర్ తమిళిసై
రికవరీ ఏజెంట్ల దుశ్చర్య.. లోన్ కట్టలేదని గర్భిణీపైకి ట్రాక్టర్ ఎక్కించి హత్య!