Central Warns AP on Financial discipline : ఉచితాలు, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో కుప్పకూలిన శ్రీలంక పరిస్థితులను చూసి అప్రమత్తం కావాలని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. శ్రీలంకలోని స్థితిగతులను చెప్పడానికి విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Central Warns states on Financial discipline : దేశంలోని మిగతా రాష్ట్రాల స్థితిగతులనూ ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, ఝార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రుణాలు జీఎస్‌డీపీలో 32%కి చేరినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలను దాటినట్లు పేర్కొన్నారు.
Central on Financial discipline : ‘2019-2022 మధ్యకాలంలో ఏపీ బడ్జెటేతర మార్గాల నుంచి రూ.28,837 కోట్ల రుణం తీసుకుంది. విద్యుత్తు సంస్థలకు రూ.10,109 కోట్ల బకాయిలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.34,208 కోట్లకు గ్యారంటీలు ఇచ్చింది’ అని వివరించారు. తెలంగాణ రుణాలు జీఎస్‌డీపీలో 25%కి చేరాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయి, వృద్ధి రేటు, అప్పుల మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? బడ్జెటేతర రుణాలు ఎంత మేరకు తీసుకున్నాయి? ఆస్తుల తాకట్టు, డిస్కంలు, జెన్‌కోలకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రాలు ఇచ్చిన గ్యారెంటీల గురించి ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించి అప్రమత్తం చేశారు.
శ్రీలంక పరిస్థితుల గురించి వివరించడానికి పిలిచి రాష్ట్రాల అప్పుల గురించి చెప్పడంపై తెరాస నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, వైకాపా నేత మిథున్‌రెడ్డితోపాటు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులనూ చెప్పాలని డిమాండు చేశారు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రూ.95 లక్షల కోట్లు అప్పు చేసిందని, దాని గురించి వివరిస్తే బాగుంటుందని తెరాస ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పులపై ప్రజెంటేషన్ ఇవ్వడం ఏమిటని నిలదీశారు. తెలంగాణ జీఎస్‌డీపీలో 23%కి మించి అప్పులు చేసిందన్న వాదనలను కేశవరావు ఖండించారు. కేంద్రం అప్పులు జీడీపీలో 59%కి మించి ఉన్నాయని, దీనికి ఎవరు సమాధానమిస్తారని ప్రశ్నించారు. ఆర్థిక లోటు జీడీపీలో 3.5% పరిమితిలోపే ఉంటే కేంద్రం లోటు 6.2%కి చేరిందని పేర్కొన్నారు.
తీసుకున్న అప్పులను చెల్లించడంలో తెలంగాణ ఎప్పుడైనా శ్రీలంకలా విఫలమైందా? కానప్పుడు ఇలా ఎందుకు చెబుతారని కేంద్ర మంత్రిని తెరాస ఎంపీలు నిలదీశారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రం శ్రీలంక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండు చేశారు. కేంద్రం చేసిన అప్పులపైనా సమాధానం చెప్పాలని డీఎంకే, టీఎంసీతోపాటు పలు రాష్ట్రాలు డిమాండు చేయడంతో ఆర్థికశాఖ అధికారులు ఈ అప్పులపై ప్రజెంటేషన్ ఆపేసి... శ్రీలంకలో తాజాగా ఉన్న పరిస్థితులు, భారత్ అందిస్తున్న సాయం గురించి వివరించారు.
"రాష్ట్రాల పరిస్థితుల గురించి వాస్తవాలే చెప్పాం. అందులో మేమేమీ రాజకీయం చేయలేదు. శ్రీలంక లాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తామని అనుకోవడం లేదు. అయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని చెప్పడానికే ఈ ప్రజెంటేషన్ ఇచ్చాం. అందుబాటులో ఉన్న డేటా, రాష్ట్రాల స్థితిగతుల ఆధారంగా క్రమానుగతంగా వివరించాం. అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఆర్థిక క్రమశిక్షణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుపరిపాలన తప్పనిసరి. రాష్ట్రాల్లో ఎవరు ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నారు.. ఎవరు లేరన్న విషయాన్ని పోల్చి చూపాం. ఎవరు ఎంత కాదన్నా అంతిమంగా లెక్కలు లెక్కలే. ఎవరి పేరైనా పైకి వచ్చి ఉంటే అందుకు కారణం ఉంటుంది." - అఖిలపక్ష సమావేశానంతరం విలేకరులతో కేంద్ర మంత్రి జైశంకర్