Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు హైకోర్టులో మెమో దాఖలు చేశారు. ఈడీ అధికారులు అడిగిన వివరాలు ఇచ్చామని మెమోలో అధికారులు పేర్కొన్నారు. ఎక్సైజ్ అధికారులపై ఈ నెల 11న ఈడీ అధికారులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ... ఎక్సైజ్ అధికారులు సరైన వివరాలు ఇవ్వడం లేదని ఈడీ తరఫు న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు.
2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎక్సైజ్ శాఖాధికారులు దర్యాప్తు చేశారని... ఈ సందర్భంగా దాదాపు 62 మందిని ప్రశ్నించినట్లు ఈడీ పేర్కొంది. దర్యాప్తులో భాగంగా పలువురి రక్త, గోర్ల నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్కు పంపారని.. దానికి సంబంధించిన నివేదిక ఇవ్వడం లేదని ఈడీ అధికారులు తెలిపారు. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, ఇతర కీలక ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ... ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నట్లు ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. కేవలం 12 ఎఫ్ఐఆర్లు, నేరాభియోగపత్రాలు మాత్రమే ఇచ్చారని... మిగతావి ఇవ్వడంలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈడీ అధికారులు అడిగిన వివరాలన్నీ ఇచ్చి దర్యాప్తునకు సహకరించాలని గతంలోనే న్యాయస్థానం ఆదేశించినా... ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నెల రోజుల్లోపు(మార్చి 3 వరకు) ఇ్వవాలని హైకోర్టు గడువు పెట్టినా... ఎక్సైజ్ అధికారుల నుంచి ఎలాంటి పత్రాలు రాలేదని ఈడీ అధికారులు దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ పిటిషన్లో పేర్కొన్నారు.
ఎక్సైజ్ శాఖ తరఫున అడ్వకేట్ జనరల్ మెమో దాఖలు చేశారు. ఈడీ అధికారులు అడిగిన వివరాలన్నీ అందజేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈడీ అధికారులకు పూర్తి సమాచారం చేరితే... దర్యాప్తు మరోసారి ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇప్పటికే సినీరంగానికి చెందిన 12మందికి గతేడాది ఆగస్టులో నోటీసులిచ్చి ప్రశ్నించారు. వాళ్ల బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా ఆధారంగా ఈడీ దర్యాప్తు మరింత కీలకం కానుంది. ఇందులో లభించే వివరాల ఆధారంగా ఈడీ అధికారులు అవసరమైతే మరోసారి సినీ రంగానికి చెందిన వాళ్లను ప్రశ్నించే అవకాశం ఉంది.
- సంబంధిత వార్త: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన ఈడీ
ఇదీ చదవండి: కేంద్రమంత్రి గడ్కరీతో విజయవాడ, భువనగిరి ఎంపీల భేటీ