కరోనా తీవ్రత కారణంగా ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడనున్నాయి. ఈనెల మూడో వారం నుంచి రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో పాటు.. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు వాయిదా పడటంతో.. రీషెడ్యూలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ప్రస్తుత ప్రవేశ పరీక్షలను వాయిదా వేసి.. కొత్త తేదీలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రతిపాదనలు పంపించారు. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాల కోసం ఈనెల 19 నుంచి 22 వరకు జరగాల్సిన పీజీ ఈసెట్‌ను ఆగస్టు 11 నుంచి 14 వరకు.. జులై 1న జరగాల్సిన ఈసెట్‌ను ఆగస్టు 3న నిర్వహించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. జులై 5 నుంచి 9 వరకు జరగాల్సిన ఎంసెట్‌ను నెల రోజులు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్ జరిపేందుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్ ఆగస్టులో ఉన్నందున.. వాటిలో మార్పులు అవసరం లేదని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఆగస్టు 19, 20న ఐసెట్, 23న లాసెట్, పీజీఎల్ సెట్, 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్ యథాతథంగా జరపాలని భావిస్తున్నారు.
ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు నిర్వహించే టీసీఎస్ ఐయాన్ సంస్థతో చర్చించి కొత్త తేదీలను ఖరారు చేశారు. జేఈఈ వంటి జాతీయ పరీక్షలను కూడా టీఎసీఎస్ ఐయాన్ నిర్వహిస్తుంది. కాబట్టి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు ఉండే తేదీల్లో కాకుండా ఇతర రోజుల్లో రాష్ట్రస్థాయి పరీక్షలకు ప్రణాళిక చేసినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక.. ఉన్నత విద్యా మండలి కొత్త తేదీలను ప్రకటించనుంది. మరోవైపు వాయిదా పడిన జేఈఈ మెయిన్ మూడో పరీక్షను జులై చివరి వారంలో జరిపేందుకు ఎన్‌టీఏ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మూడో పరీక్ష నిర్వహించిన తర్వాత నాలుగో పరీక్షపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.