భవిష్యత్ తరానికి కాలుష్యరహితమైన ప్రపంచాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో శ్వాస,లంగ్ కేర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మీనారాయణ, సినీ దర్శకుడు ఎన్.శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన పాఠశాల విద్యార్థులకు కాలుష్యాన్ని ఏ విధంగా నివారించవచ్చనే అంశాలపై అవగాహన కల్పించారు.
గాలి కాలుష్యం వల్ల దేశంలో ప్రతి ఏటా 25 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని లక్ష్మీ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని తెలిపారు. తీవ్ర వాయు కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న దిల్లీ పరిస్థితిని విద్యార్థులకు వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నివారించాలని తెలిపిన ఆయన అవసరానికి మించి వాహనాలను సైతం నడపకూడదని సూచించారు.
ప్రతి పది మందిలో 9 మంది గాలి కాలుష్యం బారిన పడుతున్నారని... మనిషి తనతో పాటు పంచభూతాలను కూడా కాలుష్యపరుస్తున్నాడని శ్వాస ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ విష్ణు రావు వీరపనేని అన్నారు. శ్వాస ఫౌండేషన్ ,లాంగ్ కేర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలలో విద్యార్థులకు కాలుష్య నివారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో భాజపా బృందం భేటీ