వానాకాలం పంటల సాగుకు నాసిరకం, నకిలీ విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి దళారులు, వ్యాపారులు సరిహద్దు రాష్ట్రాల జిల్లాలకు తెచ్చి.. అక్కడి నుంచి తెలంగాణ అంతటా తరలిస్తున్నారు. పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా వాటి అమ్మకాలకు అడ్డుకట్ట పడటం లేదు. వానాకాలం సీజన్‌లో 80 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ తాజా అంచనా. ఎకరానికి రెండు పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం. 450 గ్రాములుండే ప్యాకెట్‌ను రూ.767కు అమ్మాలని కేంద్రం ఇటీవల ఆదేశించింది. విత్తనాలను ప్యాకెట్లలో కాకుండా విడి(లూజు)గా అమ్మకూడదు. కానీ.. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి బస్తాల్లో తెచ్చి కిలోల చొప్పున అమ్ముతున్నారు. ఇది చట్టప్రకారం నేరమైనా ఎవరూ పట్టించుకోవడం లేదు.
మహారాష్ట్ర నుంచి తెచ్చి..
మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంది. అక్కడ సాగయ్యే సాధారణ రకాలనే బీటీ అని చెప్పి ప్రముఖ కంపెనీల పేర్లున్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి తెలంగాణకు తెచ్చి అమ్ముతున్నారు. ఆ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న మంచిర్యాల జిల్లాలో ఇటీవల పోలీసులు జరిపిన తనిఖీల్లో 29 మందిని అరెస్టు చేసి.. 13,040 కిలోల విడి పత్తి విత్తనాల బస్తాలను పట్టుకున్నారు. ఇవన్నీ నకిలీలే అని తేలింది.
విత్తన కంపెనీలు వెనక్కిచ్చినా..
జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులతో 36 వేల ఎకరాల్లో పత్తి విత్తన కంపెనీలు విత్తన పంటలు సాగు చేయిస్తున్నాయి. దేశంలో అవసరమైన పత్తి విత్తనాల్లో సగానికి పైగా ఈ జిల్లా నుంచే వస్తాయి. విత్తనాలు నాసిరకంగా ఉంటే కంపెనీలు వెనక్కిచ్చేస్తాయి. వాటిని రైతులకు అమ్మకూడదు. కానీ, వాటిని దళారులు తీసుకుని.. ప్రముఖ కంపెనీల పేరుతో అమ్ముతున్నారు. పోలీసులు జరిపిన తనిఖీల్లో గద్వాలలో ఒక దళారీ మిల్లులో 20 క్వింటాళ్ల నాసిరకం పత్తి విత్తనాలు, ఐజ మండల పరిధిలో 2 క్వింటాళ్లు, మల్దకల్ మండలం నేతువానిపల్లిలో 30 క్వింటాళ్లు పట్టుబడ్డాయి. గతేడాది నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న 38 మందిపై కేసులు పెట్టారు. అయినా ఈ ఏడాదీ క్వింటాళ్ల కొద్దీ విక్రయిస్తున్నారు.
పర్యవేక్షణ కొరవడిందంటున్న రైతు సంఘాలు
గతంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్ సీడ్స్) ద్వారా పలు పంటల విత్తనాలను రాయితీపై రైతులకు నేరుగా విక్రయించేది. ఈ ఏడాది నుంచి ప్రధాన పంటలపై రాయితీని రద్దు చేయడంతో విత్తన సంస్థల నుంచే రైతులు కొనాల్సి వస్తోంది. వ్యవసాయ శాఖ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండటం, ఇన్‌ఛార్జి కార్యదర్శి కొనసాగుతుండటంతో రాష్ట్రస్థాయి నుంచి పర్యవేక్షణ లేదని రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి. విత్తన విభాగాన్ని పర్యవేక్షించాల్సిన ఉప సంచాలకుడి(డీడీ) పోస్టు ఖాళీగా ఉంది. వరంగల్‌లో పనిచేసే అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించారు.
యథేచ్ఛగా హెచ్‌టీ విత్తనాల విక్రయం
పత్తిలో పచ్చపరుగు సోకని బీటీ రకం విత్తనాలను అమెరికాకు చెందిన మోన్‌శాంటో కంపెనీ 20 ఏళ్ల క్రితం తెచ్చింది. అయిదేళ్ల క్రితం విషపూరిత రసాయన మందు ‘గ్లైఫోసెట్’ చల్లినా చావని హెచ్‌టీ (హెర్బిసైడ్ టాలరెంట్) పత్తి విత్తనాలనూ ఇదే కంపెనీ తెచ్చింది. వీటిని మనదేశంలో కేంద్రం అనుమతించలేదు. అయినా సాధారణ బీటీ పత్తి విత్తనాలంటూ విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలను నాటడం వల్ల మొక్కల మధ్య పెరిగే కలుపు మొక్కలను చంపడానికి గ్లైఫోసెట్‌ను చల్లాల్సి వస్తోంది. దీనివల్ల పర్యావరణానికి హానే కాకుండా రైతుల ఆరోగ్యమూ దెబ్బతింటోంది. ఈ రసాయనం అమ్మకాలనూ నిషేధిస్తూ వ్యవసాయ శాఖ ఇటీవల జీఓ జారీచేసింది. అయినా హెచ్‌టీ విత్తనాలను యథేచ్ఛగా అమ్ముతున్నారని ఓ కంపెనీ అధికారి ‘ఈనాడు’కు తెలిపారు. నకిలీ, నాసిరకం సోయా విత్తనాల అమ్మకాలూ పెరిగాయి. సాధారణ కంది విత్తనాలనే సంకరజాతి (హైబ్రీడ్)పేరిట రైతులకు అంటగడుతున్నారు.
ఇవీచూడండి: Covid Effect: కొమ్మ కొమ్మకో కన్నీటి చెమ్మ... జగమంత కుటుంబంపై వైరస్ పంజా