వరసగా మూడో సీజన్‌లో పంట రుణాలు కట్టనివారిని ఎన్‌పీఏ జాబితాలో చేరుస్తున్నాయి. ఇలా చేర్చిన రైతుల సంఖ్య గత మార్చి నాటికే 3 లక్షలు దాటినట్లు సమాచారం. కొత్త అప్పుల మంజూరుకు బ్యాంకులు మొండిచేయి చూపుతున్నాయి. రాష్ట్రంలో ధరణి పోర్టల్ లెక్కల ప్రకారం 61 లక్షల మంది రైతుల భూమి ఖాతాలున్నాయి. వీరిలో 42 లక్షల మంది 2018 డిసెంబరు 11 నాటికి రుణమాఫీ పథకం కింద బ్యాంకుల్లో రూ.లక్ష వరకూ బాకీ ఉన్న అర్హులని వ్యవసాయశాఖ 2019లో గుర్తించింది. ప్రభుత్వం వడపోత చేపట్టి.. రుణమాఫీకి 36 లక్షల మంది అర్హులని తేల్చింది. వీరంతా వెంటనే బాకీ చెల్లించి కొత్త రుణం తీసుకోవాలని.. వీరి రుణమాఫీ నిధులను బ్యాంకులకు ప్రభుత్వం వాయిదా పద్ధతిలో విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గతంలో ప్రకటించారు. ‘‘దీంతో కొందరు రైతులు తమ బాకీని ప్రభుత్వం కడుతుందని భావించి చెల్లించడం లేదు. కొత్త రుణం తీసుకోవడం లేదు. దీంతో నిబంధనల ప్రకారం వీరు ఎగవేతదారుల జాబితాలోకి చేరుతున్నారని’’ ఓ బ్యాంకు సీనియర్ అధికారి ‘ఈనాడు’కు తెలిపారు. బ్యాంకుల పరిభాషలో దీనిని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్(ఎన్‌పీఏ)గా వ్యవహరిస్తారని వివరించారు. ఇచ్చిన రుణం బ్యాంకులకు తిరిగి రాని పరిస్థితి ఉంటే ఇలా నిరర్థక ఆస్తిగా పరిగణిస్తారని తెలిపారు.
ఏడాదిలోపు కట్టేది 30 శాతంలోపే.. రైతు పంట రుణం తీసుకున్న తేదీ నుంచి సరిగ్గా ఏడాదిలోగా బ్యాంకుకు తిరిగిచెల్లిస్తే కేవలం పావలా(4 శాతం) వడ్డీ మాత్రమే పడుతుంది. ఉదాహరణకు 2021 మే 26న తీసుకున్న పంట రుణాన్ని 2022 మే 25కల్లా కచ్చితంగా తిరిగికట్టేయాలి. ఇలాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీని రాయితీగా చెల్లిస్తుంది. ఏడాదిలోపు తిరిగిచెల్లిస్తే బ్యాంకు 7 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఇలాంటి రైతుల జాబితాను రిజర్వు బ్యాంకుకు పంపితే 3 శాతం వడ్డీని రాయితీ కింద కేంద్ర ప్రభుత్వం రైతు ఖాతాలో వేస్తుంది. ఇలా కేంద్రం నుంచి వడ్డీ రాయితీ పొందుతున్న రైతులు రాష్ట్రంలో 10 నుంచి 12 లక్షల మంది మాత్రమే ఉంటున్నారని అంచనా. మొత్తం రుణాలు తీసుకున్నవారిలో ఏడాదిలోగా పంట రుణం తిరిగికడుతున్న రైతులు 30 శాతంలోపే ఉంటున్నారు. మిగతా 70 శాతం మందికి కేంద్రం రాయితీ అందడం లేదు. వారి రుణాలపై 12 శాతానికిపైగా వడ్డీ పడుతోంది. పైగా వరసగా మూడో సీజన్ దాకా పంట రుణం తిరిగిచెల్లించకపోతే ఎన్‌పీఏ జాబితాలో చేరుతున్నారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకుని ఇప్పటిదాకా తిరిగిచెల్లించని రైతులందర్నీ బ్యాంకులు ఎన్‌పీఏ జాబితాలో చేరుస్తున్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 76 వేల మందికి పంట రుణాలివ్వగా వీరిలో 20 వేల మంది ఎగవేతదారుల జాబితాలోకి చేరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష మంది వరకూ ఈ జాబితాలో ఉన్నారు. వీరెవరికీ బ్యాంకులు కొత్తగా పంట రుణాలిచ్చే అవకాశం లేదు. దీంతో పెట్టుబడికి ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓ సీనియర్ వ్యవసాయాధికారి పేర్కొన్నారు.
ఇవీ చదవండి:తెలంగాణలో భాజపాకు... అధికారం ఖాయం