పెద్దయ్యాక ప్రభుత్వోద్యోగంలో స్థిరపడాలి.. డాక్టర్ అవ్వాలి.. కలెక్టరై ప్రజలకు సేవ చేయాలి.. ఇలా చిన్నతనంలో ప్రతి ఒక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది. అయితే కొంతమంది వీటిని చేరుకునే దిశగా ప్రయత్నాలు చేస్తే.. మరికొంతమంది పెరిగి పెద్దయ్యాక అప్పటి పరిస్థితులు, ఇష్టాయిష్టాల మేరకు తమ లక్ష్యాన్నే మార్చుకుంటుంటారు. ఇలా అంతిమంగా ఓ కెరీర్ అంటూ నిర్ణయించుకున్నప్పటికీ దాన్ని చేరుకోవడంపై దృష్టి పెట్టలేక వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొనే వారూ లేకపోలేదు. ప్రతిభ ఉన్నా నిజానికి ఆ సమయంలో ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో పాలుపోదు. ఇదిగో ఇలాంటి సందిగ్ధం ఉన్నప్పుడు కెరీర్ కౌన్సెలింగ్కి వెళ్తే చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో కెరీర్ కౌన్సెలర్ మీలో ఉన్న నైపుణ్యాలు, ఆసక్తుల్ని పరిగణనలోకి తీసుకొంటారు. అలాగే మీరు మీ గోల్‌పై ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారో, ఈ క్రమంలో మీరు ఇంటా-బయటా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? అన్న విషయాలపై ప్రశ్నలు సంధించి అసలు కారణమేంటో తెలుసుకుంటారు. తద్వారా వాటిని అధిగమించేందుకు సలహాలు, సూచనలు ఇస్తారు.
వేరే ఆప్షన్ లేకపోతే..!
కొన్ని అత్యవసర పరిస్థితులు, కుటుంబ బాధ్యతల వల్ల ముందు ఏదో ఒక ఉద్యోగంలో చేరడం, ఆ తర్వాత మనం అనుకున్న లక్ష్యంపై దృష్టి పెడదాంలే అనుకోవడం మనలో చాలామంది చేసేదే! అయితే ఏదో ఒకలా ఉద్యోగమైతే సంపాదిస్తాం కానీ అందులో అస్సలు సంతృప్తే ఉండదు.. పైగా వేరే జాబ్ వెతుక్కుందామంటే ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్ పనులతోనే సరిపోతుంటుంది. ఆ కారణంగా విధి లేక అదే ఉద్యోగాన్ని కొనసాగించాల్సి రావచ్చు. అయితే ఇలా ఇష్టం లేకుండా చేసే ఉద్యోగం ఎప్పటికైనా కష్టంగానే ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి సమయంలో మీ కెరీర్ లక్ష్యంపై దృష్టి సారించేందుకు ఏం చేయాలో కెరీర్ కౌన్సెలర్ల సలహా తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సవాళ్లను ఎదుర్కొంటూనే మీ కలల ఉద్యోగంపై ఏకాగ్రత పెట్టేందుకు తగిన సలహాలు, సూచనలు వారు అందిస్తారు. అలాగే మరో ఆప్షన్ లేని పక్షంలో ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగాన్ని ఎలా ప్రేమించాలి? అందులో ఎలా రాణించాలి? అన్న విషయాలు సైతం వారు మీకు వివరించి.. మీ మనసు మార్చే అవకాశాలున్నాయి.
నెక్స్ట్ ఏంటి?
పది, ఇంటర్, డిగ్రీ/బీటెక్.. ఇలా ఒక్కో దశ చదువు పూర్తయ్యే కొద్దీ నెక్స్ట్ ఏంటి? అన్న ప్రశ్న చాలామంది మనసులో ఉంటుంది. అలాగే మన మనసులో ఒక కోర్సు చదవాలని ఉంటే.. మన పేరెంట్స్ మనసులో మరో ఆలోచన ఉండచ్చు.. ఈ కోర్సు చదివితే నా కూతురికి బోలెడన్ని కెరీర్ ఆప్షన్లుంటాయి.. అంటూ వాళ్లు మన గురించి లోతుగా ఆలోచించచ్చు.. కొన్నిసార్లు మన తల్లిదండ్రుల ఆలోచన కరెక్టా, లేదంటే మన ఆలోచన సరైందా? అన్న సందిగ్ధంలో పడిపోతుంటాం. ఇలా ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో వాళ్లను, వీళ్లను అడిగితే తలా ఓ మాట చెబుతారు. అదే కెరీర్ కౌన్సెలర్ అయితే భవిష్యత్తులో ఉండే అవకాశాలను బట్టి ఏ కోర్సు ఎంచుకుంటే బాగుంటుందో వివరిస్తారు. ఈ క్రమంలో మీరు, మీ పేరెంట్స్ కలిసే కౌన్సెలింగ్‌కి వెళ్లొచ్చు. తద్వారా ఇద్దరికీ నెక్స్ట్ ఏంటి అన్న విషయంలో ఓ స్పష్టత వస్తుంది. ఫలితంగా పైచదువులపై పూర్తి దృష్టి పెట్టి అనుకున్నది సాధించచ్చు.
లేటుగానైనా లేటెస్ట్‌గా!
కొంతమందికి ఉద్యోగం చేయాలని ఉన్నా పెళ్లి, పిల్లలు, ఇతర కుటుంబ బాధ్యతలు.. ఒకదాని తర్వాత మరొకటి నెత్తిన పడడంతో అది కుదరకపోవచ్చు. ఆలస్యంగానైనా.. అంటే పిల్లలు కాస్త పెద్ద వారై తమ పనులు తాము చేసుకునే వయసులో అమ్మలకు తమకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి వీలు కుదురుతుంది. అయితే ఇలాంటప్పుడు తమ చదువును బట్టి ఎలాంటి ఉద్యోగం చేయాలి? ప్రత్యేకమైన కోర్సులేమైనా చేయాలా? జాబ్‌కి ఎంపికవ్వాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? కాస్త ఆలస్యంగా కెరీర్ ప్రారంభించినా భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఎలాంటి నైపుణ్యాలు అలవర్చుకోవాలి? ఇలా బోలెడన్ని సందేహాలు తలెత్తుతాయి. ఇక వీటన్నింటికీ కెరీర్ కౌన్సెలర్ వద్దే సరైన సమాధానం దొరుకుతుంది. ఈ క్రమంలో మీ చదువు, ఒకవేళ ఇంట్లో ఉంటూనే ఏవైనా కోర్సులు నేర్చుకుంటే వాటిని పరిగణనలోకి తీసుకొని మీకు ఎలాంటి కెరీర్ ఆప్షన్లుంటాయో తెలియజేస్తారు. దాన్ని బట్టి అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలేంటి? జాబ్ సంపాదించాలంటే రెజ్యూమే ఎలా తయారుచేసుకోవాలి? వ్యక్తిగతంగా-వృత్తిపరంగా ఎలాంటి నైపుణ్యాలు అలవర్చుకోవాలి? వ్యక్తిత్వ వికాస లక్షణాల్ని ఎలా పెంపొందించుకోవాలి? ఇవన్నీ మీకు వారు వివరిస్తారు. తద్వారా ఆలస్యంగా మీరు కెరీర్ ప్రారంభించినా చక్కటి గైడెన్స్‌తో అందులో దూసుకుపోవచ్చు.
అన్నీ తెలుసు.. కానీ!
ఈ ఆధునిక యుగంలో కాలంతో పాటు మనమూ పరిగెత్తాలి.. లేదంటే కెరీర్‌లో వెనకబడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మనం ఎంచుకున్న కెరీర్ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవడం అత్యవసరం అంటున్నారు నిపుణులు. అయితే కొంతమందికి తమకు ఏ సబ్జెక్ట్‌పై పట్టుందో?, ఏ కెరీర్‌ను ఎంచుకోవాలో? వంటి విషయాలన్నీ తెలిసినా.. ఈ క్రమంలో ఆయా అంశాల్లో వస్తోన్న మార్పులన్నింటి పైనా వారికి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. దాంతో తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో అర్థం కాదు. అలాంటప్పుడు కెరీర్ కౌన్సెలింగ్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ మీ రంగాల్లో మీరు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవడం కోసం, కొత్త ఉద్యోగావకాశాల కోసం మీరు ఫాలో కావాల్సిన కొన్ని వెబ్‌సైట్స్ వారు మీకు సూచిస్తారు. అలాగే ఈ దిశగా పలు మెలకువలు కూడా చెప్తారు. సో.. వాళ్ల సలహాలు, సూచనలు పాటిస్తే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.. అందరికంటే మెరుగ్గా కెరీర్‌లో రాణించచ్చు కూడా!
ఇలా మీ కెరీర్, చదువు గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా, సందిగ్ధంలో ఉన్నా.. కెరీర్ కౌన్సెలింగ్ ద్వారా బయటపడచ్చు. తద్వారా మీ భవిష్యత్తు గురించి మీకు పూర్తి స్పష్టత, భరోసా వస్తాయి. కెరీర్‌లో ఉన్నతికి కావాల్సింది కూడా ఈ రెండే!
ఇదీ చదవండి: MLA Jogu Ramanna: గంటలో 3.5 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం