నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ ఇన్నోవెక్స్ పేరిట శనివారం ప్రత్యేక ఇంక్యుబేషన్ కేంద్రం ప్రారంభమైంది. విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఖరోలా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, జీఎంఆర్ విమానాశ్రయాల వాణిజ్య విభాగం ఛైర్మన్ జీబీఎస్ రాజు, జీఎంఆర్ విమానాశ్రయాల ముఖ్య ఆవిష్కరణల అధికారి ఎస్‌జీకే కిశోర్, జీఎంఆర్ ఆవిష్కరణల విభాగం అధిపతి రామ అయ్యర్ హాజరై ప్రారంభించారు. సృజనాత్మక ఆలోచనలతో వచ్చే పరిశోధన సంస్థలు, విద్యాసంస్థలకు చెందిన వారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన తోడ్పాటును ఈ కేంద్రం అందించనుంది. ముఖ్యంగా విమానయాన పరిశ్రమ, జీఎంఆర్ వ్యాపారాలలో ఆవిష్కరణలకు పెద్దపీట వేయనుంది. అంకుర సంస్థలు, కార్పొరేట్లు, ఆవిష్కరణ కేంద్రాల భాగస్వామ్యంతో ‘ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజీ’గా పనిచేయనుంది. ఎయిర్‌బస్, ప్లగ్ అండ్ ప్లే, స్వీడిష్ ఇన్‌స్టిట్యూట్, టీహబ్, ఐఐటీ హైదరాబాద్, ఇక్రిశాట్, షులిచ్ బిజినెస్ స్కూల్(కెనడా) వంటి సంస్థలతో కలిసి ఇది పనిచేయనుంది.
విజయవంతమైన ఆవిష్కరణలను మార్కెట్ చేసే వ్యూహాన్ని రూపొందించేందుకు కృషి చేస్తుంది. ప్రస్తుతం విమానయాన రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలు వస్తున్నాయన్నాయని విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా అన్నారు. కొవిడ్‌తో ఈ రంగం తీవ్రంగా దెబ్బతిని, తిరిగి నిలబడగలిగిందన్నారు. ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వడానికి కేంద్రం ఉపయోగపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కర్ణాటక మత్తు దందాలో కదులుతున్న డొంక