విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ట్రెజరీ, ఆరోగ్యశాఖ అధికారులు రూ.20 కోట్ల మేర పెన్షన్లు స్వాహా చేయడంపై ఏపీ లోకాయుక్త ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా ఉండవచ్చని, వీటిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలంటూ ఆర్థికశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌కు లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
విశాఖపట్నం జిల్లా చింతపల్లి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెన్షన్‌ల స్వాహాపై 2017 నవంబరులో ‘ఖజానాకే కన్నం’, ‘కబోది ఖజానా’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై స్పందించిన లోకాయుక్త అప్పట్లో వాటిపై ప్రాథమిక నివేదికలను తెప్పించింది. పెన్షన్‌ల చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు తేల్చడంతోపాటు సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు నివేదికల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉండే అవకాశం ఉందని, వీటిపై విచారణ జరిపి అక్టోబరు 5లోగా నివేదికలు సమర్పించాలంటూ లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: వెయ్యి పేజీల పుస్తకమైనా క్షణాల్లో అనువాదం చేయడంలో..తెలుగోడి ఘనత