అలీ నవాజ్ జంగ్, డా. బీఆర్ అంబేడ్కర్ల వర్ధంతి సందర్భంగా పలువురు ఇంజినీర్లు నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని జలసౌధ ప్రాంగణంలో ఉన్న అలీ నవాజ్ జంగ్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆర్ విద్యాసాగర్ రావుల విగ్రహాలతో పాటు అంబేడ్కర్ చిత్ర పటానికి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ పూల మాలలు వేసి నివాళలు అర్పించారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బాహాదూర్ వర్ధంతిని... గత పదేళ్లుగా తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినంగా జరుపుకుంటున్నామని వివరించారు.
అనంతరం దివంగతులైన ఇంజినీర్ల చిత్ర పటాల ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 72 మంది సాగునీరు, రహదారులు భవనాలు, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, పబ్లిక్ హెల్త్ , హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డ్, విద్యుత్ సంస్థలు, రైల్వే శాఖల ఇంజినీర్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో చిన్న వయసులో కరోనా సోకి మరణించిన యువ ఇంజినీర్లు కూడా ఉన్నారనని ఆందోళన వ్యక్తం చేశారు.