దీక్ష, అక్షితలు చిన్నప్పట్నుంచీ స్నేహితురాళ్లు. ఒకరు లా ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకొకరు సైకాలజీ పూర్తి చేశారు. మొదటి నుంచీ ఏ పనిచేసినా పదిమందికీ ఉపయోగపడాలి, వినూత్నంగా ఉండాలని ఆలోచించేవారు. అలా కెరీర్ ప్లానింగ్ చేసుకుంటున్న సమయంలో వీరికి మొదట వచ్చిన ఆలోచన ‘పాప్ స్పాట్’. ఈ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న స్థలాలను అద్దెకు తీసుకుని వాటిని చిరువ్యాపారులకు దుకాణాలు పెట్టుకోవడానికి అందించేవారు. అలాగే మాల్స్, దుకాణ సముదాయాల్లో వివిధ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశాన్ని వారికి కల్పించేవారు. అయితే తమకు ఎదురైన రెండుమూడు సంఘటనలు రైతులు, మహిళల గురించి ఆలోచించేలా చేశాయి అంటారు వీరిలో ఒకరైన దీక్ష.
‘ఒక రోజు హోటల్‌లో కాఫీ తాగుతుండగా ఓ వ్యక్తి మావద్దకు వచ్చి కొవిడ్ వల్ల ఉద్యోగం పోయిందని, ఏదైనా పని ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. మరొకరోజు కూరగాయల మార్కెట్టులో ఓ మహిళారైతు తాను కష్టపడి పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదంటూ బాధపడింది. అదే రోజు మాకు తెలిసిన ఒకావిడ తనకు బేకింగ్ బాగా తెలుసు అని, అయితే దాన్ని కెరీర్‌గా మార్చుకుని కుటుంబానికి ఆసరా అవుదామనుకుంటున్నా... ఏదైనా ఆలోచన చెప్పమని అడిగింది. ఈ సంఘటనలన్నీ మమ్మల్ని ఆలోచనలో పడేశాయి. వాటి నుంచే మాకు ఒక ఐడియా వచ్చింది. ఇటువంటివారందరినీ ఓ చోట చేరిస్తే ఎలా ఉంటుందనుకుని చర్చించుకున్నాం. ఇద్దరికీ ఇదే మంచి పరిష్కారం అనిపించింది. తక్షణం దానిపై పనిచేయడం మొదలుపెట్టాం. అలా ‘ఈచ్ మండి’ మొదలైంది. దీనికి అర్థం ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావొచ్చు’ అని అంటారామె.
ఆరుగురితో మొదలై...
ఫిల్మ్‌నగర్‌లోని క్యూబా డ్రైవ్ ఇన్‌లో మూడు నెలల క్రితం ఈచ్‌మండిని ఏర్పాటు చేశారు దీక్షా, అక్షితలు. ఇక్కడ ఎవరైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. వేదిక వివరాలు అందించారు. వీరి పిలుపునందుకుని మొదట ఆరుగురు రైతులు ముందుకు వచ్చారు. నామమాత్రపు రుసుము తీసుకుని వారికి అవకాశం కల్పించాం అంటారు అక్షిత. ‘ఆ నోటా, ఈ నోటా తెలిసి ఈచ్‌మండీకి మంచి ప్రచారం వచ్చింది. క్రమంగా ఇక్కడ 100 మందికి పైగా తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ అమ్మేవాటికి మేం బ్రాండింగ్ చేస్తాం. కూరగాయలు మొదలుకుని కేకులు, పచ్చళ్లు, నూనెలు బియ్యం వంటి అన్నిరకాలూ ఇక్కడ దొరుకుతాయి. 90 శాతానికి పైగా మహిళలు చిరువ్యాపారాలు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. పెద్ద పెద్ద బ్రాండ్లూ క్యూలు కడుతున్నాయి. కొవిడ్‌వల్ల ఉపాధి కోల్పోయిన ఓ వ్యక్తి ఇక్కడ కాఫీ షాపు తెరిచాడు. ఓ షూకంపెనీ తమ బ్రాండ్ అమ్మకాలకోసం స్టాల్‌ని పెట్టింది. డిజైనర్లు, ఆర్టిస్ట్‌లు...వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. సాధారణ, మధ్యతరగతి వర్గాలకు చేరువవుతోన్న ఈ సంత పేరుని ప్రస్తుతం ‘మిడిల్ మార్కెట్టు’గా మార్చాం అంటారామె.
- ఇదీ చూడండి : పూజారి సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ భక్తుడు