ఆంధ్రప్రదేశ్‌లోని 13, తెలంగాణలోని 4 నగరాల్లో ట్రాఫిక్ చలానాలు జారీ చేసేందుకు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పీడ్ కెమెరా, సీసీ టీవీ కెమెరా, స్పీడ్‌గన్, బాడీ వేరబుల్ కెమెరా, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, వేయింగ్ మిషన్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్న పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయాలంది. ఎక్కువ ముప్పు, ఎక్కువ రద్దీ ఉండే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, సంక్లిష్టమైన కూడళ్లలో వీటన్నింటినీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లా కేంద్రాలు, కృష్ణా జిల్లాలోని విజయవాడ, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలలో ఈ పరికరాలను ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌లో ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, పటాన్‌చెరు, సంగారెడ్డిలలో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఈ పరికరాల్లో పొందుపరిచిన స్థలం, సమయం, తేదీ ఆధారంగా చలానాలు జారీ చేస్తారు. ఆయా ప్రాంతాల్లో నిర్దేశిత వేగానికి మించి వాహనాలు వెళ్లినపుడు, అనుమతిలేని ప్రాంతాల్లో పార్కింగ్ చేసినప్పుడు, డ్రైవర్లు, ప్రయాణికులు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించనప్పుడు, సిగ్నల్ జంపింగ్, అధికలోడుతో వెళ్తున్నప్పుడు, సరకు రవాణా వాహనాల్లో మనుషులను రవాణా చేస్తున్నప్పుడు ఈ కెమెరాల్లో నిక్షిప్తమైన సాక్ష్యాధారాల ద్వారా చలానాలు జారీ చేస్తారు.
ఇదీ చదవండి: 'భార్యకు విడాకులు ఇవ్వొచ్చు.. పిల్లలకు కాదు'