Schools Reopen in Telangana Today : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మంగళవారం నుంచి తెరచుకోనున్నాయి. సంక్రాంతి సెలవుల్లో భాగంగా జనవరి 8 నుంచి విద్యాసంస్థలన్నీ మూతపడగా.. కరోనా కారణంగా సెలవులను 31 వరకు పొడిగిస్తూ వచ్చారు. మళ్లీ వాటిని తెరిచేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో మొత్తం సర్కారు బడులు, అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యాయి. విశ్వవిద్యాలయాలూ ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నాయి.
Educational Institutions Reopen Today : హైదరాబాద్‌లో మాత్రం కొన్ని సీబీఎస్‌ఈ పాఠశాలలు ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. మరికొన్ని కొద్దిరోజులపాటు ఆన్‌లైన్ తరగతులు జరపాలని నిర్ణయించాయి. టీశాట్ విద్యా ఛానెల్ ద్వారా టీవీ పాఠాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ సోమవారం షెడ్యూల్ విడుదల చేయలేదు. మంగళవారం కూడా అవి ఉంటాయో ఉండవో అధికారులు తేల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత విద్యా క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి కాదు కాబట్టి మే నెలాఖరు వరకు విద్యా సంవత్సరాన్ని పొడిగించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు తదితరులు సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు.
అప్పటి మార్గదర్శకాలేనా?
Telangana Schools Reopen Today : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు జరపాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఆ నిబంధనలు ఏమిటో తాజాగా చెప్పలేదు. గత సెప్టెంబరులో హైకోర్టు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలనే అనుసరించాలని యాజమాన్యాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!