Tollywood drugs case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వడం లేదంటూ సీఎస్ సోమేష్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ కింద సోమేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ ను శిక్షించడంతో పాటు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోరింది.
2017లో వెలుగులోకి చూసిన డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులను ఎక్సైజ్ శాఖ ప్రశ్నించింది. కేసు దర్యాప్తు చేసిన ఎక్సైజ్ శాఖ 12 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. అయితే కేసును సీబీఐ, ఈడీ, ఎన్సీబీ, డీఆర్ఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
తాము విచారణకు సిద్ధంగా ఉన్నామని... డిజిటల్ రికార్డులు, తదితర వివరాలు ఇచ్చేలా ఎక్సైజ్ శాఖను ఆదేశించాలని హైకోర్టును ఈడీ కోరింది. విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలువురు సినీ తారలను ప్రశ్నించింది. అయితే ఎక్సైజ్ శాఖ సహకరించడం లేదని ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయెల్ స్వయంగా హైకోర్టుకు వివరించారు.
విచారణ జరిపిన హైకోర్టు ఈడీకి అవసరమైన డిజిటల్ రికార్డులు, ఇతర పత్రాలన్నీ ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ రేవంత్ రెడ్డి పిల్‌పై విచారణ ముగించింది. అవసరమైతే మళ్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చునని ఈడీకి తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. నిందితులు, కొందరు సాక్షులకు సంబంధించిన మొబైల్ నంబర్లను ప్రస్తావిస్తూ వాటికి సంబంధించిన డిజిటల్ రికార్డులు ఇవ్వాలని ఎక్సైజ్ ను ఈడీ కోరింది.
ఎక్సైజ్ శాఖ ఇప్పటి వరకు వివరాలు ఇవ్వలేదని.. ఎలాంటి స్పందనా లేదంటూ హైకోర్టులో కోర్టు ఈడీ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 13న సీఎస్ సోమేశ్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌కు లీగల్ నోటీసులు కూడా ఇచ్చినప్పటికీ స్పందించడం లేదని పిటిషన్లో తెలిపింది. కోర్టు ధిక్కరణ కింద సోమేశ్ కుమార్, సర్ఫరాజ్‌ను శిక్షించడంతో పాటు.. గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవలాని కోరింది. ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుంది.
ఇదీ చదవండి : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీకి సరైన ఆధారాలు దొరకలేదా..?