జై.. జై గణేశా...
సెప్టెంబరు 10న వినాయక చవితి. భాగ్యనగరంలో జరుపుకొనే అతిపెద్ద వేడుక. కొన్నేళ్లుగా మండపాలు, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్‌మెంట్స్, గృహాల్లో మట్టిగణపతి ప్రతిమలను ఉంచి పూజలు జరిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది కరోనా ప్రభావంతో సంబరాలు కొద్దిగా తగ్గినా ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో స్వచ్ఛంద సంస్థలు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నాయి.
మూడేళ్లుగా తమ గేటెడ్ కమ్యూనిటీలో మట్టితో తయారు చేసిన గణపతి(Eco friendly ganesh) విగ్రహాలనే ఉత్సవాల్లో ఉంచుతున్నామని మాదాపూర్ నివాసి సరిత తెలిపారు. 20-30 కుటుంబాలు కలసి ఒక్క విగ్రహాన్ని పూజించటం ద్వారా అనుబంధం పెరగటమే కాకుండా వృథాను కూడా తగ్గించినట్టు వివరించారు. ఈసారి 5 అడుగుల విగ్రహాన్ని తయారు చేయిస్తున్నట్టు చెప్పారు. నగరంలోని మై పూజాబాక్స్ అంకుర సంస్థ 5 అంగుళాల నుంచి 2 అడుగుల ఎత్తు వరకూ ప్రకృతి గణపతి విగ్రహాలను విక్రయిస్తున్నట్టు సంస్థ సీఈఓ కావేరి సచ్‌దేవ్ తెలిపారు.
పండుగ పైసలు పల్లెకు
పండుగ ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకొనే వేడుక. కొవిడ్‌తో పట్టణాలు, పల్లెలూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి క్లిష్టమైన వేళ వినాయకచవితి ఒకరికొకరు చేయూతనిచ్చుకునేందుకు మార్గం చూపుతుందని ఈసీఐఎల్‌కు చెందిన బాధ్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ తెలిపారు. పర్యావరణానికి మేలు చేసేలా మట్టి గణపతి విగ్రహాలు, పూజా సామగ్రిని నగరంతోపాటు ముంబయి, బెంగళూరు, పుణె తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నట్టు తెలిపారు. 21 రకాల పత్రితో సహా 30 రకాల పూజా వస్తువులు, గంగా గణేశ్ పూజాకిట్ ద్వారా గ్రామీణులకు ఉపాధి చూపుతున్నట్టు తెలిపారు. చేనేత రైతులు, చేతివృత్తులు, మహిళా సంఘాల ద్వారానే పూజా సామగ్రి తయారు చేయించి విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుతున్నట్టు వివరించారు. దీనిద్వారా గ్రామీణులకు ఉపాధి లభించటంతోపాటు కొంతకాలం జీవనోపాధిగా ఉపకరిస్తుందన్నారు.
ప్రధాని మెచ్చిన మొక్క గణపతి
విఘ్నాలు తొలగించే గణనాథుల విగ్రహాలు నిమజ్జనం తరువాత పచ్చదనం పంచుతాయి. కూకట్‌పల్లికి చెందిన ప్లాన్ ఏ ప్లాంట్ అంకుర సంస్థ ద్వారా ‘ప్లాంట్ గణేశ(plant ganesh)’ మట్టిప్రతిమలు విక్రయిస్తున్నారు. గతేడాది వినాయక చవితి సమయంలో సుమారు 15,000 విగ్రహాలు విక్రయించినట్టు సంస్థ నిర్వాహకురాలు అంజనా తెలిపారు. ఆధ్యాత్మికత ద్వారా పర్యావరణ రక్షణకు మా ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసాపత్రం పంపినట్టు ఆమె వివరించారు. ఈ ఏడాది అదే స్ఫూర్తితో ప్లాంట్ గణేశులను తయారు చేస్తున్నట్టు చెప్పారు. చాలా ప్రాంతాల నుంచి విగ్రహాల కోసం ఆర్డర్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిమను తయారు చేసేటప్పుడు బెండ, మిరపకాయ, వంకాయ విత్తనాలు ఉంచుతామన్నారు. నవరాత్రుల అనంతరం కుండీలో నీటితో నిమజ్జనం చేశాక మొక్కలు బయటకు వస్తాయన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బహుమతులుగా మొక్కలు, మట్టి గణపతులను ఇచ్చేందుకు ఇష్టపడుతున్నట్టు అంజనా వివరించారు.