ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థ... ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లియరెన్సూ తీసుకోలేదని మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ కేంద్ర కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. నగరంలోని ఆర్.ఆర్.వెంకటాపురం పరిధిలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఏర్పాటుకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఎలా అనుమతి ఇచ్చిందో అవగతం కావటం లేదని అన్నారు.
ఉత్పత్తి ప్రారంభించేందుకు కూడా పీసీపీ ఎందుకు అనుమతిచ్చిందన్నది ప్రశ్నార్ధకమని వివరించారు. విశాఖలో ఇప్పటి వరకూ 40 వరకూ పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయని... వీటి కారణంగా చాలా మంది కార్మికులు, స్థానికులు మృత్యువాత పడ్డారని ఈఏఎస్ శర్మ లేఖలో పేర్కొన్నారు. ప్రమాదాలకు సంబంధించి పరిశ్రమ యాజమాన్యాలకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ శిక్షలు పడలేదని స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా అత్యవసర పరిశ్రమలకు అనుతులివ్వటం సమంజసమే అయినా ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఎలాంటి అత్యవసరాలను ఉత్పత్తి చేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు.
లాక్డౌన్ నుంచి ఈ పరిశ్రమ ఉత్పత్తికి అనుమతి మంజూరు చేసిన ఉన్నతాధికారులపై విచారణ చేపట్టాలని కోరారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఏర్పడిన కాలుష్యం రోగ నిరోధక శక్తిని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. తద్వారా కరోనాకు ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తగిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు విశ్రాంత ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ.
ఇదీ చదవండి: విశాఖ తీరం.. కన్నీటి సంద్రం