చైనా మాంజా వల్ల పక్షులకు ముప్పు వాటిల్లుతోందని ఎంత చెప్పినా.. దాని వాడకం మాత్రం తగ్గడం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలంతా పెద్దఎత్తున గాలిపటాలు ఎగురవేశారు. వీటి కోసం ఎక్కువ మంది చైనా మాంజానే వినియోగించారు. ఈ పతంగుల పండుగలో ఎన్నో గాలిపటాలు తెగి.. చెట్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలకు తగులుకున్నాయి.
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో అలా తెగిన గాలిపటానికి ఉన్న చైనా మాంజాకు ఓ గద్ద చిక్కుకుని విలవిలలాడింది. అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది గమనించి స్పందించగా.. తిరిగి ప్రాణం పోసుకుంది.
తెగిపడిన గాలిపటానికి ఉన్న దారం గద్ద మెడకు చుట్టుకుని గాలిలో తాడులా వేలాడుతూ కనిపించింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. నిచ్చెన సాయంతో గద్దను కిందకు దించారు. దాని మెడ చుట్టూ ఉన్న దారాన్ని జాగ్రత్తగా తీసి నీళ్లు తాగించారు. కొద్ది సేపటి తర్వాత బతుకు జీవుడా అంటూ గద్ద ఎగిరిపోయింది.
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్లో చైనా మాంజా తగిలి ఒక కొంగ చెట్టు కొమ్మపై ప్రాణాలతో కొట్టు మిట్టాడింది. ఈనాడు సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. కొంగను కాపాడారు.
చైనా మాంజాతో పక్షుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతోందని ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజలు పెడచెవిన పెడుతున్నారని అగ్నిమాపక అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని క్షణాల సంతోషం కోసం మూగ జీవాల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని హితవు పలికారు. ప్రజలు చైనా మాంజాల వాడకాన్ని నియంత్రించాలని కోరారు.
- ఇదీ చూడండి చైనా మాంజా.. పక్షులకు డేంజా..ర్..!