హైదరాబాద్ అంటేనే మొదటగా గుర్తోచ్చేది చార్మినార్, బిర్యాని. ఇప్పుడు ఈ జాబితాలో మరొకటి చేరనుంది. మాదాపూర్ దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికి మరో మణిహారంలా మారనుంది. దేశంలోనే అతిపెద్ద తీగల వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడం వల్ల ఇవాళ ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఇంజినీరింగ్ అద్భుతం
184 కోట్ల రూపాయల వ్యయంతో 754.38 మీటర్ల పొడవుగల ఈ వంతెనను నిర్మించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 13 ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. స్టే-కేబుళ్లను ఆస్ట్రియా నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. దుర్గం చెరువు పరిసరాల్లోని పర్యావరణం దెబ్బతినకుండా కేవలం 2 పిల్లర్లపై ఈ తీగల వంతెనను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. 8 దేశాల ఇంజినీర్లు దీని నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
దూరం.. కాదిక భారం
బ్రిడ్జి నిర్మాణంతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జూబ్లీహిల్స్ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలికి దాదాపు రెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. పంజాగుట్ట నుంచి నానక్‌రాంగూడాలోని బాహ్యావలయ రహదారికి అతి సులభంగా చేరుకోవచ్చు. ఈ నిర్మాణానికి మరో ప్రత్యేకత ఆకర్షణ ఎల్ఈడీ లైట్లు నిలవనున్నాయి. మొత్తం 40 వేల లైట్లను దీనిపై అమర్చారు.
పర్యాటక ప్రియులకు...
అలాగే రవాణా సౌకర్యంగానే కాకుండా దుర్గంచెరువు పరిసరాలను పర్యాటకంగాను ముస్తాబు చేస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైకి వాహనాలకు అనుమతించరు. వారాంతాల్లో కేవలం పర్యాటకులను మాత్రమే కాలినడకన కేబుల్ బ్రిడ్జిపైకి అనుమతించనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. వాహనాలను నిర్దేశించిన స్థలంలో పార్క్ చేసుకొని, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైకి కాలినడకన మాత్రమే వెళ్లాలని సూచించారు.
ఇవీచూడండి: రైతు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు