Drunk and Drive Hyderabad : మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని కట్టడి చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మందుబాబులకు ముకుతాడు వేసేందుకు కొత్త ప్రణాళిక రూపొందిస్తున్నారు. నగరంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు తెల్లవారుజామునే ఎక్కువగా జరుగుతున్నాయి. అవి కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఇప్పటి వరకూ రాత్రి 10-12 గంటల వరకు మాత్రమే జరిపే డ్రంకన్‌డ్రైవ్ తనిఖీల సమయం పెంచాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకూ డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహించి ప్రమాదాలను అదుపు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే అధ్యయనం చేసిన నగర పోలీసులు కొద్దిరోజుల్లో క్షేత్రస్థాయిలో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.
కనిపించని మార్పు..
Drunk and Drive in Hyderabad : గతేడాది చివర్లో బంజారాహిల్స్ రోడ్ నెంబరు-2 రెయిన్‌బో ఆసుపత్రి వద్ద అతివేగంగా వచ్చిన కారు ఇద్దరిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. కారు నడుపుతున్న వ్యక్తితోపాటు ప్రయాణిస్తున్న ముగ్గురూ మద్యం మత్తులో ఉన్నట్లు వైద్యపరీక్షల్లో నిర్ధారణైంది. గచ్చిబౌలి-బీహెచ్‌ఈఎల్ వెళ్లే మార్గంలో తలకెక్కిన మత్తుతో గంటకు 120 కి.మీ వేగంతో దూసుకెళ్లిన కారు చెట్టును ఢీకొట్టి రెండు ముక్కలైంది. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. రెండు ఘటనలూ అర్ధరాత్రి దాటాక 1-3 గంటల మధ్య జరిగినవే. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఏటా నగరంలో 1900-2100 వరకూ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. 250-300 మంది మృత్యువాత పడుతున్నారు. వీటిలో అధికశాతం అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపటమే కారణాలుగా దర్యాప్తులో గుర్తిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 2021లో 25,483 మంది డ్రంకన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డారు. 206 మంది జైలుశిక్ష అనుభవించారు. వీరి నుంచి రూ.10.50కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. 25 మందికి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేశారు. కళ్లెదుట ఇంత జరుగుతున్నా వాహనదారుల్లో మార్పు కనిపించట్లేదు.
ఇప్పుడేం చేస్తారంటే
Drunken Driving in Hyderabad : రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకూ అంటే 6 గంటలు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. ఈ మేరకు నగరవ్యాప్తంగా తెల్లవారుజామున ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించారు. తనిఖీలను తప్పించుకుని పోయేందుకు వాహనదారులు వేసే ఎత్తులను చిత్తు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.