కరోనా నియంత్రణ చర్యలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తోడ్పాటు అందించారు. ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. రాష్ట్రంలో అన్నార్థుల ఆకలీ తీర్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో అభాగ్యులకు ఆయన స్వయంగా ఆహార పదార్థాలు అందించారు. కరోనా కట్టడికి ఆర్టీసీ ఉద్యోగులు ఒక్కరోజు మూలవేతనం రికవరీ చేసుకోవాలని ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మకు విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణకు వైద్యులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని సినీనటుడు నిఖిల్ పేర్కొన్నాడు. గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి శానిటైజర్స్, మాస్కూలు, కిట్లు పంపిణీ చేశారు.
ఓ వైపు ప్రభుత్వానికి విరాళాలు వెల్లువెత్తుతుంటే... పనులు లేక సతమతమవుతున్న కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో పనులు లేక ఇబ్బందులు పడుతున్న మధ్యప్రదేశ్ కూలీలకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సరుకులు అందజేశారు. ఒక్కొక్కరికి ఐదు కేజీల సన్నబియ్యం, పప్పులు, కూరగాయలు 60 మంది వలస కూలీలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క అందించారు. చెన్నై నుంచి రాజస్థాన్‌కు ముథోల్ మీదుగా వెళ్తున్న 50 మంది కూలీలకు యువకులు అన్నదానం చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో భాజపా కార్యకర్తలు వీధుల్లో నివసించే వారి ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
వాహనాలు లేక సొంతూళ్లకు వెళ్లలేని కూలీలకు పోలీసులు చేయూతనందిస్తున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు ఎస్సై బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసులకు, పాత్రికేయులకు 2వేల మాస్కులను కమిషనర్ సత్యనారాయణ పంపిణీ చేశారు. తమకు తోచినంత సాయం చేయడం, అన్నార్థుల ఆకలీ తీర్చడం ఆనందంగా ఉందని స్వచ్ఛంద సంస్థల యువకులు పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి: కూడూ లేదు.. గూడూ లేదు.. సొంతూరుకు వెళ్లాల్సిందే