దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసును సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ప్రభుత్వం, పిటిషనర్లు తమ వాదనలు హైకోర్టు ముందు వినిపించాలని ఆదేశించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కాపీని ప్రభుత్వం, పిటిషనర్లు ఇరువురికి ఇస్తారని చెప్పింది. సాఫ్ట్ కాపీ ఇవ్వాలని కమిషన్ న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో...హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును తాము ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేసు తదుపరి విచారణ, తీసుకునే చర్యలపై హైకోర్టే నిర్ణయిస్తుందని చెప్పింది.
హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న సుప్రీం.. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నివేదిక చూడకుండా కేసులో వాదనలు వినడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో మాట్లాడి రావాలని తెలంగాణ న్యాయవాదులకు సీజేఐ ధర్మాసనం చెప్పింది.