విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) లేదా దాని పరిధిలో ఏదైనా ఒక ప్రాంతంలో కరెంటు సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు చేపట్టాల్సిన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు, నమూనా పత్రాల ముసాయిదాను మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను తెలపాలని ప్రజలను కోరింది. ప్రైవేటు సంస్థలకు ప్రస్తుత డిస్కంలను అప్పగించడానికి ఏమేం పత్రాలు అవసరం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన విధానాన్ని ఇందులో వివరించింది. ‘‘వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేయడానికి.. సాంకేతిక, వాణిజ్య సగటు నష్టాలను తగ్గించడంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి.. ప్రజలు భరించే, తక్కువ ధరలకు కరెంటును అందించడానికి’’ ప్రైవేటీకరణకు కారణాలుగా పేర్కొంది.
ముఖ్యాంశాలు
- ఒక ప్రైవేటు కంపెనీ లేదా కొన్ని కంపెనీల కన్షార్షియమూ డిస్కంలను కొనుగోలు చేయవచ్చు.
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసి డిస్కంను అప్పగించాలి. డిస్కంను పూర్తిగా(100 శాతం) గానీ, లేదా 76 శాతం వరకైనా ప్రైవేటీకరణ చేయాలి.
- విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)ల నుంచి డిస్కంలు కరెంటు కొని ప్రజలకు విక్రయించేందుకు ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందం’(పీపీఏ) చేసుకుంటాయి. డిస్కంను తీసుకునే ప్రైవేటు సంస్థలకు పీపీఏలను బదిలీ చేయాలి. డిస్కం విద్యుత్ సరఫరా సగటు ధర(ఏసీఎస్)కు, సగటు ఆదాయం రికవరీ(ఏఆర్‌ఆర్)కి మధ్య ఎక్కువ వ్యత్యాసముంటే సదరు పీపీఏను ప్రభుత్వం పేరుతోనే ఉంచుకోవాలి.
- ఉద్యోగులను కొత్త సంస్థకు బదిలీ చేయాలి. పదవీ విరమణ చేసిన వారికి పింఛన్లు ఇవ్వడానికి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి.
- ఏడాదికి 5 వేల మిలియన్ యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్‌ను విక్రయించే డిస్కం కొనుగోలు టెండర్ దాఖలు రుసుమును రూ.5 కోట్లు వసూలు చేయాలి.
- మొత్తం అప్పగింత ప్రక్రియను పూర్తి చేసేందుకు ఓ కన్సల్టెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి.