అంశమేదైనా సరే తనదైన శైలిలో స్పందించి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma tweet on AP politics). తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వర్మ గురువారం ఉదయం ట్విటర్ వేదికగా ఏపీ రాజకీయాలపై కామెంట్స్(Ram Gopal Varma tweet on AP politics) చేశారు. ‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ వ్యంగ్యంగా అన్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై అల్లరిమూకల దాడితో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా బుధవారం తెదేపా బంద్ నిర్వహించింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ ఆరోపణలను కొట్టి పారేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విపక్షాలను ఉద్దేశించి జగన్ పరోక్షంగా ఆరోపించారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై వాళ్లే దాడులు చేసుకుని.. కావాలనే తమపై నెపం వేస్తున్నారని ఆరోపించారు.