DH on Dengue cases in Telangana : రాష్ట్రంలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయని.. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశముందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే విషజ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డెంగీ కేసులు అధికంగా వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 1184ల డెంగీ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 2019 తర్వాత ఈ ఏడాది డెంగీ కేసులు ఉద్ధృతంగా నమోదవుతున్నట్లు వివరించారు.
మలేరియా నిర్మూలను రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని డీహెచ్ తెలిపారు. సీజనల్ వ్యాధుల కట్టడికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక సూచనలు చేసినట్లు చెప్పారు. నీళ్ల విరేచనాలకు సంబంధించి రాష్ట్రంలో 6వేల కేసులు నమోదైనట్లు డీహెచ్ వెల్లడించారు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు కలుగుతాయని వివరించారు. తెలంగాణలో టైఫాయిడ్ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు.
వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ సూచించారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. అవేంటంటే..
- డ్రమ్ముల్లో నీరు ఎప్పటికప్పుడు తొలగించాలి.
- ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం చేపట్టి.. ఇంట్లో నిలువ ఉన్న నీటిని పారబోయాలి.
- పరిసరాల పరిశుభ్రత పాటించాలి.
- వేడివేడి ఆహారం, గోరు వెచ్చని నీళ్లు తీసుకోవాలి.
- మల,మూత్ర విసర్జన తర్వాత చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి
- రోడ్ల పక్కన చిరుతిండ్లు తినకూడదు.
- గర్భిణీలు డ్యూడేట్ కంటే వారం ముందే ఆస్పత్రిలో చేరాలి.
- బాలింతలు, చంటిపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.
- జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలి.
- మాస్కు తప్పని సరిగా ధరించాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం.
సొంత మాత్రలు వాడకుండా వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని డీహెచ్ సూచించారు. క్లోరిన్ మాత్రలను వైద్యశాలల్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని సర్కార్ దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
గత ఆరు వారాలుగా కరోనా కేసుల సంఖ్య పెరిగిందని డీహెచ్ వెల్లడించారు. కొవిడ్‌కు సంబంధించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని చెప్పారు. కరోనా ఎండ్ దశకు చేరుకుందని వివరించారు. సాధారణ జలుబు, జ్వరం లక్షణాలతో.. కరోనా కూడా సీజనల్ వ్యాధిగా మారిపోయిందని అన్నారు. కొవిడ్ లక్షణాలుంటే కేవలం ఐదు రోజులే క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అనవసరంగా కరోనా ట్రాకింగ్, ట్రేసింగ్ వద్దని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొన్నట్లు తెలిపారు. కొవిడ్ లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని డీహెచ్ శ్రీనివాస్ చెప్పారు.