ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాయాలంటే విధిగా ఏదో ఒక పాఠశాలలో చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఆ పాఠశాల ద్వారానే విద్యార్థుల వివరాలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి(ఎస్‌ఎస్‌సీ బోర్డు) సమర్పించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పటివరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివి, ఆర్థికపరిస్థితులు తలకిందులైన కారణంగా ఫీజులు చెల్లించలేని పరిస్థితి చాలా కుటుంబాల్లో నెలకొంది. ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. చెల్లించని వారిపై అనేక రకాలుగా వేధింపులకూ పాల్పడుతున్నాయి.
మరికొన్ని యాజమాన్యాలు ప్రస్తుతానికి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నా, చివరికి మొత్తం రుసుములు చెల్లిస్తేనే వార్షిక పరీక్షలకు అనుమతిస్తామని ఒత్తిడితెచ్చే అవకాశాలుంటాయని విద్యాశాఖ భావిస్తోంది. అలా ఫీజులు కట్టలేని వాళ్లు చదువు మానేయకుండా, టీవీ పాఠాలతో చదువుకుంటూ పదోతరగతి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై నిర్ణయం తీసుకుంటే ఎవరైనా నేరుగా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పరీక్ష రుసుం చెల్లించడం ద్వారా హాల్‌టికెట్ పొంది, పరీక్షలు రాసే వీలుంటుంది. దీనిపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్చించినట్లు తెలిసింది.
అంతర్గత మార్కులు లేకుంటేనే...
నేరుగా పరీక్ష రాసే సదుపాయం 2015 వరకు అమల్లో ఉండేది. నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానం అమలులో భాగంగా అంతర్గత మార్కులు ప్రవేశపెట్టడంతో విద్యాశాఖ దాన్ని రద్దు చేసింది. ఈసారి అంతర్గత మార్కులు(సబ్జెక్టుకు 20) రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకుంటే, నేరుగా పరీక్ష రాసే విధానం అమలు చేయవచ్చని కొందరు సూచించినట్లు సమాచారం.
అంటే విద్యా సంవత్సరంలో జరగాల్సిన నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్లు(ఎఫ్‌ఏ)లను రద్దు చేయాల్సి ఉంటుందన్న మాట. దీనిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. ‘ప్రతి ఏడాది రాష్ట్రంలో 5.50 లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాస్తారు. అందులో 3 లక్షల మందికిపైగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉంటారు. వారిలో ఫీజులు కట్టలేని వారికి ఈ వెసులుబాటు ప్రయోజనకరంగా ఉంటుందని’ విద్యాశాఖ భావిస్తోంది.