కరోనా నియంత్రణలో పాల్గొన్న విశాఖ పోలీసులను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. విశాఖ జిల్లాలో తొలి 3 నెలల్లో 98 కరోనా కేసులే నమోదయ్యాయన్న ఆయన... లాక్డౌన్ ఎత్తివేత అనంతరం కేసులు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 466 మంది పోలీసులకు కరోనా సోకిందని డీజీపీ వెల్లడించారు. కొవిడ్ యోధులైన పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సవాంగ్ సూచించారు. అనారోగ్య లక్షణాలున్న పోలీసుల గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
'విశాఖలో అధికారులతో రెండ్రోజులు సమావేశాలు నిర్వహించా.. మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసుశాఖ అప్రమత్తత గురించి చర్చించాం. కొవిడ్ సమయంలో విశాఖ పోలీసులు కష్టపడి పనిచేశారు. క్షేత్రస్థాయిలో పోలీసులు ముందు వరుసలో నిలుస్తున్నారు. అనేక రాష్ట్రాల కంటే మనం మొదట్నుంచి అప్రమత్తంగా ఉన్నాం. కొవిడ్‌పై పోరాటంలో ఏపీ దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది'
- గౌతం సవాంగ్, ఏపీ డీజీపీ