రాష్ట్రవ్యాప్తంగా ఐదోరోజూ దేవిశరన్నవరాత్రి వేడుకలు కనులపండువగా జరిగాయి. నిర్మల్ జిల్లా బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా నిర్వహించారు. బుధవారం స్కందమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి... దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో వేకువజాము నుంచే అక్షరాభ్యాసాలు చేయించారు.
భద్రకాళి దేవాలయంలో
వరంగల్‌లోని భద్రకాళి దేవాలయంలో దేవి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు, పసుపు కుంకుమతో అభిషేకం చేశారు. లలితా త్రిపురసుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని... జింక వాహనంపై ఊరేగించారు. హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్థంభాల ఆలయంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
జోగులాంబ ఆలయంలో
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్‌లో కుంకుమార్చన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని బొజ్జవార్ ఆలయ దుర్గా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు... మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఐదో శక్తి పీఠమైన గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలో పాల్గొన్నారు.
సరస్వతి క్షేత్రంలో
సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని విద్యా సరస్వతి క్షేత్రంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు శ్రీవిద్య లలితాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మెదక్ జిల్లాలో కుష్మాండాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గమ్మకు... భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భద్రాచలంలోని రాములోరి ఆలయంలో లక్ష్మీ తాయారు అమ్మవారు అష్టలక్ష్ములుగా భక్తుల పూజలందుకున్నారు.
ఇవీ చూడండి: విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు