శ్రీవారి దర్శన విధానాలపై కరోనా చూపిన ప్రభావంతో... తితిదే ఆన్‌లైన్ బాటపట్టింది. సాధారణ రోజుల్లో సగటున 70 వేల నుంచి లక్ష మంది వరకు దర్శించుకొనే స్థాయిని ఒక్కసారిగా 30 వేలకు పరిమితం చేయాల్సి రావడంతో దర్శన విధానాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 3 నెలల పాటు భక్తుల దర్శనాలను నిలిపివేసిన తితిదే.. అన్‌లాక్ నుంచి దర్శనాలను తిరిగి ప్రారంభించినా.. కొవిడ్ నిబంధనలను అనుసరించాల్సిన క్రమంలో భక్తుల సంఖ్యను పరిమితం చేసింది. మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 20 వేల మందికి.. సర్వదర్శనం ద్వారా 10 వేల మందితో పాటు బ్రేక్ దర్శనాలు, సుపథం ప్రవేశాలతో దర్శనానికి అవకాశం కల్పించింది. టిక్కెట్లు ఉన్న యాత్రికులను మాత్రమే అలిపిరి తనిఖీ కేంద్రంలో పరిశీలించి తిరుమలకు అనుమతిస్తూ కొవిడ్ నిబంధనల మేరకు తిరుమలేశుని దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.
సాంకేతిక సమస్యతో..
సర్వదర్శనం టోకెన్లను నేరుగా వచ్చే భక్తులకు తిరుపతిలో జారీ చేస్తుండగా.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. రోజుకు 20 వేల టిక్కెట్ల చొప్పున.. నెల రోజులకు సంబంధించిన టిక్కెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. డిసెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నవంబర్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు తితిదే విడుదల చేసింది. ఏకకాలంలో టికెట్ల కోసం అధిక సంఖ్యలో భక్తులు పోటీపడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తి వెబ్‌సైట్ పూర్తిగా స్తంభించింది. సమస్య పరిష్కరించిన గంటలోపే 23 రోజుల టికెట్లు బుక్ అయ్యాయి. ఇదే తరహాలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. 10 రోజులకు 2 లక్షల టిక్కెట్లు అందుబాటులో ఉండగా దాదాపు 5 లక్షల మంది ప్రయత్నించడంతో వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో తప్పని సరై వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీని తితిదే వాయిదా వేసింది.
ఏకకాలంలో ఎక్కువ మంది టికెట్ల కోసం ప్రయత్నించడం.. తితిదే సర్వర్‌కు తగినంత సామర్థ్యం లేకపోవడం.. ఏపీ డేటా సర్వర్‌కి అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టారు. సాంకేతిక కార్యక్రమాలు పూర్తయ్యాక.. ఆదివారం ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శన టికెట్లను తితిదే విడుదల చేయనుంది.
ఇదీ చూడండి: కాళ్లు మొక్కుతా..కాపాడు సారూ! కంటతడి పెట్టించిన రైతు గోడు