గతంలో కొండ.. కోనల్లో ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని ఎయిర్ అంబులెన్సుల ద్వారా తరలించేవారు. ప్రస్తుతం కొవిడ్ విజృంభిస్తున్న వేళ ఎయిర్ అంబులెన్సుల వినియోగం పెరిగింది. పరిస్థితి విషమించిన రోగులను తరలించడానికి వీటిని వాడుతున్నారు.
- ఇటీవల బాలీవుడ్ నటుడు సోనూసూద్ సాయంతో ఓ యువతిని, మరో వ్యక్తిని వాటి ద్వారానే నగరానికి తీసుకొచ్చారు.
- రెండు రోజుల క్రితం కొవిడ్ సోకిన 54 ఏళ్ల వ్యక్తిని సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్సు ద్వారా తరలించారు.
కొవిడ్ కారణంగా చాలామందిలో ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటున్నాయి. స్థానిక ఆసుపత్రుల్లో నయం కాకపోవడంతో దూర ప్రాంతాల నుంచి నగరంలోని ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారు కొవిడ్ రెండో వేవ్‌లో 18 మంది వరకు ఎయిర్ అంబులెన్సులో తమ ఆసుపత్రికి వచ్చారు.
- హార్ట్ అండ్ లంగ్స్ మార్పిడి నిపుణులు డా.శరణ్యకుమార్, కిమ్స్ ఆసుపత్రి
ప్రస్తుతం ప్రతి నెలా 5మంది రోగులను నగరానికి తీసుకొస్తున్నట్లు ఓ ఎయిర్‌అంబులెన్స్ నిర్వాహకులు డాక్టర్ అస్లాం తెలిపారు.
భోపాల్- హైదరాబాద్ మధ్య దూరం 850 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో దాదాపు 14 గంటలపైనే పడుతుంది.. ఎయిర్ అంబులెన్సులో గంటన్నరలో ఓ రోగిని నగరానికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చారు.
రోగితోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు, సంబంధిత ఆసుపత్రి డాక్టర్, నర్సు అందులో ఉంటారు. నిర్ణీత ఆసుపత్రిలో చేరే వరకు బాధితుల ఆరోగ్యాన్ని ఈ బృందం పర్యవేక్షిస్తుంది.
ఎయిర్ అంబులెన్సుల్లో ఆక్సిజన్‌తోపాటు వెంటిలేటర్ సౌకర్యం ఉంటుంది. అవసరమైతే ఎక్మో అమర్చుతారు.
గడిచిన 2 నెలల్లో రాజస్థాన్, బిహార్, దిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి దాదాపు 25-30 మంది కొవిడ్ రోగులను ఎయిర్ అంబులెన్సు ద్వారా నగరానికి తీసుకొచ్చారు.
ఎయిర్ అంబులెన్సుల్లో రోగులను తరలించాలంటే గంటకు కనీసం రూ.1.5 లక్షల వరకూ వసూలు చేస్తారు. అదే కరోనా రోగులైతే అదనంగా చెల్లించాలి.
- ఇదీ చదవండి : కరోనా సోకిన వారు గుండెపోటుతో మరణించడానికి కారణమదే!