బ్రిటిష్ వారిపై జరిగింది తొలి స్వాతంత్య్ర సంగ్రామమైతే.. ఇప్పుడు భాజపా ప్రభుత్వం మీద రెండో స్వాతంత్య్ర సమరం మొదలుపెట్టాలని జాతీయ రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రేదేశ్లోని విశాఖలో ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ‘రైతు, కార్మిక శంఖారావం’ నిర్వహించారు. జాతీయ స్థాయి రైతు నేతలు రాకేశ్ సింగ్ టికాయత్, అశోక్ ధావలె, బి.వెంకట్, బల్‌కరణ్ సింగ్, ధన్‌పాల్‌సింగ్ తదితరులు ఉక్కు ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని ప్రతినబూనారు.
వీరంతా ఆదివారం ఉదయం మీడియాతోనూ, సాయంత్రం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన బహిరంగ సభలోనూ మాట్లాడారు. సమైక్య పోరాటానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని, అప్రజాస్వామిక విధానాలు తెస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సాయంత్రం బీచ్‌రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా బహిరంగ సభకు వచ్చారు. సభలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ నాయకులు రాకేశ్ సింగ్ టికాయత్ మాట్లాడుతూ.. దిల్లీ చుట్టుపక్కలే ఉన్న రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసేందుకు కొత్త ఫ్రంట్‌లను ఏర్పాటు చేస్తున్నామని, విశాఖ ఉక్కు గురించీ పోరాడతామని ప్రకటించారు.
ఇక్కడి నిర్వాసితులు, రైతులు తమ భూముల్ని ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ఇచ్చారు గానీ ప్రభుత్వం అమ్ముకోవడానికి కాదన్నారు. అదానీ పోర్టు విశాఖకు దగ్గరలోనే ఉందని, అందుకోసం స్టీల్‌ప్లాంట్‌ను కొనేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రైల్వే, టెలికం, బ్యాంకులు, పెట్రోలియం, విమానయానం లాంటి ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ కేంద్రం అమ్మడానికి పూనుకొంటోందని ధ్వజమెత్తారు. వాల్‌మార్ట్ లాంటి బడా కంపెనీల్ని తెచ్చి చిరు వ్యాపారుల్ని బలిచేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ కళ్లన్నీ కార్పొరేట్ కంపెనీలపై ఉన్నాయి.. అన్ని రంగాల ఉద్యోగ ఉపాధిని దెబ్బతీయడానికి చూస్తున్నారని విమర్శించారు.
రూ.1300 కోట్లకు అమ్మాలనుకుంటున్నారు
సంయుక్త కిసాన్ మోర్చా, ఆలిండియా కిసాన్ సభ, కిసాన్ సంఘ్ నుంచి పెద్ద నేతలంతా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపేందుకే వచ్చామని ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షులు అశోక్ ధావలె అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపేవరకూ ఏ ఒక్కరూ వెనక్కి వెళ్లొద్దని కోరారు. రూ.3 లక్షల కోట్ల విలువచేసే స్టీల్‌ప్లాంట్ ఆస్తుల్ని రూ.1300 కోట్లకు అమ్మాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని ఆపడంతో పాటు వ్యవసాయ చట్టాల రద్దు, మద్దతు ధరకు న్యాయపరమైన గ్యారంటీ, విద్యుత్, కాలుష్య బిల్లులు రద్దు చేసేదాకా పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని విశాఖ నుంచి నినదిస్తున్నామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఎరువుల ధరల్ని 50 శాతం పెంచారని గుర్తుచేశారు.
వ్యవస్థల్ని కిడ్నాప్ చేయడానికే..
* ఈస్టిండియా కంపెనీని అప్పటి మొఘల్ రాజు జహంగీర్ దేశంలోకి రానిచ్చారని, ఇప్పుడు అన్ని కంపెనీల్ని మోదీ దేశంలోకి రానిస్తున్నారని ఆలిండియా కిసాన్ సభ జాతీయ నాయకులు బల్‌కరణ్ సింగ్ ఆరోపించారు. దేశంలో వ్యవస్థల్ని కిడ్నాప్ చేయడానికి మోదీ సిద్ధపడుతున్నారన్నారు.
* దేశానికి మళ్లీ బానిస రోజులు రానున్నాయని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు ధన్‌పాల్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
* ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. లాభనష్టాలతో పనిలేకుండా స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పడం ఆంధ్రుల ఆత్మగౌరవానికి గొడ్డలిపెట్టు లాంటిదని అభివర్ణించారు. పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ విశాఖ స్టీల్‌పై 2001లో రాసుకున్న పాలసీ, ప్రొసీజర్స్‌లో భూముల ప్రస్తుత విలువను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పినా.. మోదీ బృందం కారుచౌకగా అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
* ఏపీలోని విశాఖ ఉక్కు గొప్పదనం గురించి మోదీ, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌కు ఏమీ తెలియదని ఆలిండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు.
* రైతు, కార్మిక ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ మందస రైతులు తాము పండించిన జీడిపప్పు, కొబ్బరిని నేతలకు అందించారు. మత్స్యకారులు సముద్రంలో బోట్లకు జెండాలు కట్టి సంఘీభావం ప్రకటించారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారికి సభలో నివాళులర్పించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యుధ్‌వీర్‌సింగ్, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్లు సిహెచ్ నరసింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరాం తదితరులు ప్రసంగించారు. అంతకుముందు రైతు సంఘాల నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర జరుగుతున్న దీక్షల్లో పాల్గొని మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: పెరుగుతున్న కొవిడ్ మరణాలతో అంత్యక్రియలకు ఇబ్బందులు!