ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం కొత్తగా అదనపు అప్పు తీసుకునేందుకు ఇచ్చిన అనుమతులు, అందుకు చూపుతున్న కారణాలు విస్తుగొలుపుతున్నాయి. సీపీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులూ ఆశ్చర్యపోతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమలు చేస్తూ ప్రతి నెలా తమ వేతనాల నుంచి 10 శాతం తీసుకుంటూ ఆ మొత్తం ఆధారంగా అప్పు ఎలా తీసుకుంటారని వారు నిలదీస్తున్నారు. పైగా కేంద్రం చెప్పే లెక్కలకు, వాస్తవ లెక్కలకు మధ్య పొంతన లేదనేది మరో కీలకాంశమైంది.
కేంద్రం ఏం చెప్పింది?
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.44,574 కోట్ల బహిరంగ మార్కెట్ రుణ పరిమితికి అనుమతులిచ్చాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ పథకానికి ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తున్న మొత్తం, ఉద్యోగుల వాటాగా వారు చెల్లిస్తున్న మొత్తం కలిపితే వచ్చే దాన్ని పరిగణనలోకి తీసుకుని దానికి సమానంగా రూ.4,203.96 కోట్ల అదనపు రుణానికి అనుమతి ఇస్తున్నాం’ అంటూ కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో వెల్లడించారు. ఈ లెక్కలు చూసిన ఆర్థిక నిపుణులు, సీపీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులకు అనుమానాలు తలెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగులు దాదాపు 1,90,000 మంది ఉన్నారు. వీరు తమ జీతంలో 10% వాటా చెల్లిస్తున్నారు. ప్రభుత్వం అంతే మొత్తాన్ని తన వాటాగా చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్‌లో జమ చేయాలి.
ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య ప్రకారం ప్రభుత్వం తన వాటాగా 2020-21లో రూ.850 కోట్లు చెల్లించింది. ఉద్యోగుల వాటా కలిపితే అది రూ.1,700 కోట్లు అయింది. 2021-22లో రెండు వాటాలు కలిపి రూ.2,160 కోట్లు జమచేశారు. అంటే రూ.460 కోట్లు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.500 కోట్లు పెరిగిందనుకుంటే రూ.2,660 కోట్లు వరకు ఉంటుందని అంచనా. గ్రామ, సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేస్తున్నారు. దాదాపు 93వేల మంది ఉద్యోగులు కొత్తగా సీపీఎస్‌లోకి వస్తారు. వీరందరి సీపీఎస్ వాటా నెలకు దాదాపు రూ.24.96 కోట్లు అవుతుందని లెక్క. ప్రభుత్వవాటా కలిపితే నెలకు రూ.50 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 8 నెలలకు లెక్కిస్తే అది రూ.400 కోట్లు అవుతుంది. ఈ మొత్తం కలిపినా సుమారు రూ.3,060 కోట్లు ఉంటుంది. మరి ఈ లెక్కన కేంద్రం రూ.4,203 కోట్ల అదనపు రుణం ఏ ప్రాతిపదికన మంజూరు చేసిందనేది ప్రశ్నార్థకమవుతోంది.
ఉద్యోగుల వాటాకు ఎందుకు అప్పు?
‘ప్రభుత్వం తన వాటా సొమ్ముగా సీపీఎస్ నిధికి సొమ్ములు జమ చేస్తున్నందున ఆ మేరకు అభివృద్ధిపై ఖర్చు చేసే వనరులు తగ్గిపోతున్నాయని అనుకోవచ్చు. ఆ మేరకు కేంద్రాన్ని సాయం అడగవచ్చు. మధ్యలో ఉద్యోగుల వాటా సొమ్ములకు రాష్ట్రం ఎలా అప్పు అడుగుతుంది? కేంద్రం ఎందుకు ఇస్తుంది?’ అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్ రద్దు చేయకపోగా.. తమ వాటా సొమ్ములతో అప్పులు ఎలా తెస్తారని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రామాంజనేయులు ప్రశ్నించారు.
ఇవీ చదవండి:
'విభజన సమస్యల పరిష్కారం ఎప్పుడో చెప్పలేం'
కామన్వెల్త్ క్రీడలు వచ్చేశాయ్.. పోటీలే పోటీలు.. పతకాల వేటలో భారత అథ్లెట్లు!