హైదరాబాద్ మహానగరంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి పోలీసులు చేపట్టిన "ఆపరేషన్ ముస్కాన్" విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది సైబరాబాద్ పోలీసులు రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో బాల కార్మికులను రక్షించారు. చిన్నారుల ముఖంలో నవ్వులు విరిసేలా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి.
పోలీసుల కృషి భళా..
పరిస్థితుల కారణంగానో.. మరే ఇతర కారణాల రీత్యానో కొంతమంది చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. ఈ వ్యవస్థను నిర్మూలించడానికి "ఆపరేషన్ ముస్కాన్" పేరిట పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారు.
చిన్నారులను కాపడడమే లక్ష్యం
కర్మాగారాలు, పరిశ్రమలు, కార్ఖానాలు ఇతర ప్రాంతాల్లో బాలకార్మికులుగా మగ్గుతున్న చిన్నారులను కాపాడడమే ఈ కార్యక్రమం లక్ష్యం. పరిశ్రమలు, ఇతర ప్రాంతాల్లో తరచు దాడులు నిర్వహిస్తు పోలీసులు చిన్నారులను బంధ విముక్తులను చేస్తున్నారు.
"ఆపరేషన్ ముస్కాన్" - పోలీసుల విజయాలు
- రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో 541 మంది చిన్నారులను బాలకార్మిక వ్యవస్థ నుంచి కాపాడారు.
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సైబరాబాద్ పోలీసులు ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
- కమిషనరేట్ పరిధిలో ఇందుకోసం మొత్తం తొమ్మిది బృందాలు డీసీపీ అనసూయ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 247 కేసులు నమోదు చేశారు.
- మేడ్చల్‌లోని ఒక పత్తి మిల్లులో 15 మంది బాలకార్మికులను కాపాడారు. ఈ చిన్నారులంతా మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, అసోం రాష్ట్రాలకు చెందిన వారు.
- మైలార్‌దేవ్‌పల్లిలో పది మంది చిన్నారులను ఉక్కు పరిశ్రమ నుంచి రక్షించారు. కాటేదాన్‌లోని ప్లాసిక్ పరిశ్రమ నుంచి పోలీసులు ఆరుగురిని కాపాడారు.
- బీహెచ్‌ఇఎల్ వద్ద భిక్షాటన చేస్తున్న హెచ్‌ఐవి ఎయిడ్స్ సోకిన ముగ్గురు చిన్నారులను రక్షించారు. వీరి తల్లిదండ్రులు ఎయిడ్స్ కారణంగా మృతి చెందగా, బంధువులు చిన్నారులతో బలవంతంగా భిక్షాటన చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
"చిన్నారులను బాలకార్మికులుగా తయారు చేస్తే..... వాట్సప్ నెంబర్లు 7901115474, 949061744, smileteamcyb@gmail.com ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. చిన్నారులను బాలకార్మికులుగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" - సైబరాబాద్ పోలీస్
ఇవీ చూడండి: "దిశ కేసు నిందితుల మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం..!"